మారేడుమిల్లి, న్యూస్‌లైన్ : ప్రజాస్వామ్యానికి ఓటే ఆయుధమని కలెక్టర్ నీతూ ప్రసాద్ పేర్కొన్నారు. ఓటు హక్కును సద్వినియోగపరుచుకుని అభివృద్ధికి తోడ్పాటునందించే నాయకులను ఎన్నుకోవాలని గిరిజనులకు ఆమె సూచించారు.
కలెక్టర్ నీతూప్రసాద్ గురువారం మారేడుమిల్లి మండలంలో పర్యటించారు. తొలుత ఆమె స్థానిక జెడ్పీ హైస్కూలులో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు. మారేడుమిల్లిలోని పోలింగ్ కేంద్రాల్లో ఫర్నిచర్, తాగునీటి ఏర్పాట్లు, విద్యుత్‌సరఫరా, వెబ్ సౌకర్యాలను పరిశీలించారు.
అనంతరం మారేడుమిల్లి మండలం బంద గ్రామంలో ఓటు వేసేలా ప్రజలను చైతన్య పరచేందుకు ఓటర్లకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలకు బంద గ్రామంలో పోలింగ్ బూత్‌లను నూతనంగా ఏర్పాటు చేసినట్టు ఆమె తెలియజేశారు. సాధారణంగా వెయ్యిమంది ఓటర్లు ఉన్నచోట ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాన్ని కేటాయిస్తుందన్నారు.
అయితే గిరిజన ప్రాంతాల్లో దూరభారాలను పరిగణనలోకి తీసుకొని 400 మంది ఓటర్లు ఉన్నప్పటికీ పోలింగ్‌కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
గుడిసే గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేపట్టిన రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, ఆర్డీవో శంకరవరప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణికుమార్, ఈఈ నాగేశ్వరరావు, తహశీల్దారు సుబ్బారావు, రెవెన్యూ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
ఓటే ఆయుధం
Published Fri, Apr 11 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM
Advertisement