
రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం: చినరాజప్ప
పిఠాపురం: రైతురుణాల మాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో గురువారం ఆయన వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీపై చిత్తశుద్ధితో ఉన్నారని, మాఫీ విధివిధానాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారని తెలిపారు. రుణమాఫీపై ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు.
రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేసేందుకే కోటయ్య కమిటీని నియమించారన్నారు. రైతులతో పాటు చేనేత, డ్వాక్రా సంఘాల రుణాలను సైతం మాఫీ చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుత సీజన్‌లో రైతులకు సకాలంలో బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా చూస్తామన్నారు. మహిళలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. బెల్ట్ షాపులను పూర్తిస్థాయిలో అరికట్టడంతో పాటు ఎంఆర్‌పీ రేట్లకే మద్యాన్ని విక్రయించేలా ఆదేశించినట్టు చెప్పారు.