- కేంద్రానికి ఏపీ సీఎం బాబు వినతి
- సమస్యల పరిష్కారానికి తెలంగాణ కూడా సహకరించాలి
- కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ
- ఏపీలో విపక్షానికి రాజకీయ అవగాహన లేదని విమర్శ
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సహా కేంద్ర ప్రభుత్వం కూడా కూర్చొని అందరికీ ఆమోదయోగ్య పరిష్కారం చేసి, ఏపీకి వచ్చిన నష్టాన్ని భర్తీ చేసే బాధ్యతను తీసుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. విభజన చట్టంలోని విద్యుత్, సంస్థలతో పాటు చట్టంలోని ఇతర అంశాలపై పద్ధతి ప్రకారం పరిష్కారం చేసుకోడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో ఆదివారం ఇక్కడ భేటీ అయిన అనంతరం టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు అశోక్‌గజపతి రాజు, సుజనాచౌదరిలతో కలసి సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.
హేతుబద్ధత లేని విభజనతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని పూడ్చే విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు. టీ ప్రభుత్వం వాహనాల ప్రవేశ పన్ను వసూళ్లు చేయడంపై మాట్లాడుతూ.. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని, ఏపీ నుంచి వివిధ పనులపై వచ్చే వారు నాలుగైదు రోజులు అక్కడే(తెలంగాణలో) ఉంటే ఆదాయం ఎవరికి వస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు.
కొత్త హైకోర్టు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జరగాలని సూచించారు. రాజధాని మాస్టర్‌ప్లాన్ వివరాలు జూన్‌లో వస్తాయని, ఆ తర్వాత నిర్మాణం చేస్తామని సీఎం తెలిపారు. పోలవరంతో పాటు రాజధాని నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్టు చెప్పారు.పట్టిసీమపై విపక్షం అభ్యంతరాలు లేవనెత్తడంపై మాట్లాడుతూ.. ‘అవగాహన లేని స్వార్థ రాజకీయంతో పట్టిసీమను అడ్డుకుంటే పుట్టగతులుండవు.
పట్టిసీమతో రాయలసీమలో కరువు నివారణ జరుగుతుంది. స్థానిక రైతులు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు సమర్థిస్తున్నాయి. రాయలసీమలో ఉండే వ్యక్తి దుర్మార్గమైన పనిచేయడం బాధాకరం. వీరి డీఎన్‌ఏలో ఉంది. తండ్రి కూడా తెలుగుగంగ పథకానికి అడ్డం పడ్డారు. ఢిల్లీకి వచ్చి ఫిర్యాదు చేయడం చేతకాని రాజకీయం. విపక్ష హోదాను దుర్వినియోగం చేస్తున్నారు. అవినీతి కేసుల నుంచి బయటకు రావడానికి ఆలోచిస్తూ రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు’ అని విమర్శించారు.
రాష్ట్రానికి ఆర్థిక చేయూతనివ్వాలి
ఏపీని ఆర్థికంగా ఆదుకోడానికి చేయూతనివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీని కోరినట్టు చంద్రబాబు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఏపీకి మంజూరు చేసిన నిధులతో కొంత బయటపడ్డామని, రెవెన్యూలోటు తీర్చడానికి ఈ ఏడాది కాగ్ నివేదిక ఆధారంగా నిధులిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు మరిన్ని నిధులివ్వాలని ఆర్థిక మంత్రి జైట్లీని కోరినట్టు చెప్పారు.ప్రత్యేక హోదా విషయాన్ని గట్టిగా అడుగుతున్నామన్నారు.
జగ్జీవన్‌రామ్‌కు శ్రద్ధాంజలి
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిర్వహించిన దివంగత నేత జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర మంత్రులు అశోక్‌గజపతి రాజు, సుజనాచౌదరి, ఎంపీ గుండు సుధారాణి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలచారి, తేజావత్ రామచంద్రుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.