మన ఆలయాలు వెండి కొండలు | Our temples are silver hills | Sakshi
Sakshi News home page

మన ఆలయాలు వెండి కొండలు

Published Sun, Jun 11 2017 1:44 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

మన ఆలయాలు వెండి కొండలు

మన ఆలయాలు వెండి కొండలు

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో బంగారానికి పోటీగా వెండి ఆభరణాల నిల్వలు పేరుకుపోతున్నాయి.

ఏడు ప్రధాన దేవాలయాల్లో 31,467 కిలోల వెండి ఆభరణాల నిల్వలు   
- శ్రీకాళహస్తి ఆలయంలో అత్యధికంగా 21 వేల కిలోల వెండి
- ప్రతి ఆలయంలో 100 కిలోలకు తక్కువ కాకుండా వెండి ఆభరణాలు
 
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో బంగారానికి పోటీగా వెండి ఆభరణాల నిల్వలు పేరుకుపోతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం కాకుండానే రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల్లో 31,467 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తీశ్వరస్వామి వారికి భక్తులు 20,966.585 కిలోల వెండిని కానుకల రూపంలో సమర్పించారు. శని దోష నివారణకు శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయంలో రాహు–కేతు పూజలకు భక్తులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. శనిదోష పూజలో ఉపయోగించిన వెండి నాగ పడగలను ఆలయ హుండీలో సమర్పించడం ఆనాదిగా ఆచరిస్తున్న సంప్రదాయం.

దశాబ్దాలుగా ఈ పూజలు చేయించుకున్న ప్రతి భక్తుడు వెండి నాగ పడగల ఆభరణాలను స్వామి వారికి సమర్పించుకోవడంతో ఆలయంలో వెండి నిల్వలు భారీగా పేరుకుపోయాయి. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 2,033 కిలోలు, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారి ఆలయ ఖజానాలో 2,442 కిలోల వెండి ఆభరణాలున్నాయి. అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయ ఖజానాలో 1,815 కిలోలు, సింహాచలం వరలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ఖజానాలో 1,996 కిలోల వెండి నగలున్నాయి. రాష్ట్రంలో ఏటా రూ.5 కోట్లకుపైగా ఆదాయం వచ్చే ఆలయాలు 16 ఉండగా, వీటిలో ప్రతి ఆలయంలో కనీసం 100 కిలోలకు తక్కువ కాకుండా వెండి ఆభరణాలుండడం విశేషం.
 
శ్రీకాళహస్తి ఆభరణాలు కడ్డీల రూపంలోకి...
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో వెండి ఆభరణాల స్వీకరణ విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ఆలయంలో వెండి 2012 నాటికే దాదాపు 21,000 కిలోలకు చేరింది. ఏటా పెరిగిపోతున్న వెండి నిల్వలను భద్రపరచడం కష్టసాధ్యంగా మారడంతో 2013 నుంచి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. దేవస్థానం వద్ద నిల్వ ఉన్న వెండి ఆభరణాలను కరిగించి, కొత్తగా పూజకు ఉపయోగించే నాగ పడగలను చేయిస్తున్నారు. వాటినే పూజా సమయంలో భక్తులకు విక్రయిస్తున్నారు. వెండి ఆభరణం ఖర్చును కూడా పూజ టికెట్‌ ధరలోనే కలిపి వసూలు చేస్తున్నారు. ఇలా భక్తులు సమర్పించే ఆభరణాలను కరిగించి, కొత్త భక్తులకు అందుబాటులోకి తెస్తున్నారు.

ఆలయంలో ఉన్న 21,000 కిలోల వెండిలో 2,300 కిలోలను ప్రత్యేకంగా కరిగించి, రీసైక్లింగ్‌ పద్ధతిన రాహు–కేతు పూజకు ఉపయోగించే నాగ పడగలు తయారీకి కేటాయించారు. మిగిలిన 18,000 కిలోలకు పైగా వెండి ఆభరణాలను కరిగించి, కడ్డీల రూపంలోకి మార్చి, ఆలయ స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. రోజువారీ అవసరాలకు ఉపయోగించే ఆభరణాలు మినహా మిగిలిన బంగారు నగలను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తే, వాటిపై ఆలయానికి వడ్డీ జమ అవుతుంది. అయితే, వెండి ఆభరణాల విషయంలో ఇలాంటి వెసులుబాటు లేదు. అందుకే నిల్వ ఉన్న వెండిని బంగారం రూపంలోకి మార్చాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement