మూగజీవం కాదు సొంత బిడ్డే!
► శునకానికి అంత్యక్రియలు
►దశ దిన కర్మ నిర్వహించిన వైనం
►కాశీలోని భైరవస్వామి ఆలయానికి వెండి శునకం
రాజమహేంద్రవరం: మూగజీవం కాదు... అది తమ సొంత బిడ్డగానే పెంచిపోషించారు. దానిపై ఎంతో మమకారం పెంచుకున్నారు. వీధికుక్కల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ శునకం మృతి చెందడంతో ఆమె రోదన అంతా ఇంతాకాదు. బొమ్మూరు వెంకటేశ్వరనగర్‌కు చెందిన వెంపాటి మంగాదేవి చివరకు శునకాన్ని శ్మశాన వాటికలో ఖననం చేసి, మైలు పాటించి, దశదిన కర్మలు నిర్వహించి దాన ధర్మాలు చేపట్టారు. విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు శేషావతారం భార్య మంగాదేవి 14 ఏళ్ల క్రితం హుకుంపేటలోని ఓ ఆస్పత్రిలో వైద్యసేవలందిస్తుండేవారు.
ఆ సమయంలో ఒకరింట్లో ఆమె వైద్యసేవలందించారు. ఆ గృహస్తులు నగదు ఇవ్వబోతుండగా.. వద్దని చెప్పి వారింటిలో 2004 మే 28న జన్మించిన పప్పీఅనే కుక్కపిల్లను అడిగి తీసుకున్నారు. అప్పటి నుంచి పప్పీని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అది వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోయింది. గత నెల 16న మంగాదేవి కేరళ, కాశీ తదితర పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్లారు. ఆ సమయంలో పప్పీని హుకుంపేట రామకృష్ణనగర్‌లోని అత్తవారింటి వద్ద వదిలి వెళ్లారు. గత నెల 19న ఇంటి ఆవరణలో ఉన్న పప్పీని వీధిక్కులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.
వేరే ప్రాంతంలో ఉంటున్న మంగాదేవి కుమారుడు పృథ్వీ, కుమార్తె రాధికలకు ఈ విషయం తెలిసి హుటాహుటిన ఇక్కడికి వచ్చారు. వెంటనే విజయవాడలోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయినప్పటికీ కోలుకోలేదు. తీర్థయాత్రల నుంచి మంగాదేవి గత నెల 29న ఇంటికి చేరుకున్నారు. 30న ఉదయం మంగాదేవి ఒడిలోనే పప్పీ మృతి చెందింది. దీంతో ఆమె సొంత బిడ్డను కోల్పోయినంతగా రోదించారు. పప్పీని కోటిలింగాల రేవులోని శ్మశానవాటికలో ఖననం చేశారు. 10 రోజులు పాటు మైల పాటించారు. శనివారం పప్పీని ఖననం చేసిన చోట పురోహితులచే పూజలు చేయించి, దాన ధర్మాలు చేశారు. జీవకారుణ్య సంఘంలోని వృద్ధులకు అన్నదానం చేశారు.
ఆత్మ శాంతి కోసం కాశీ వెళ్తున్నా
పదమూడేళ్ల పది నెలలు పప్పీని సొంత బిడ్డలా చూసుకున్నాను. దాని ఆత్మ శాంతి కోసం పప్పీ రూపంలో వెండి బొమ్మను తయారు చేయించి కాశీలోని భైరవస్వామి ఆలయంలో ఉంచుతాను. దీని వల్ల పప్పీ ఆత్మకు శాంతి చేకూరుతుందని భావిస్తున్నాను.
– వెంపాటి మంగాదేవి