రాష్ట్ర ప్రభుత్వం తన కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మాజీ మంత్రి డాక్టర్ పి.శంకర్రావు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో గంటసేపు మౌన దీక్ష చేశారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తన కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మాజీ మంత్రి డాక్టర్ పి.శంకర్రావు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో గంటసేపు మౌన దీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సీఎం, డీజీపీలు నన్ను వేధిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతను, హైకమాండ్‌కు విధేయుడిని అయిన నన్ను రెండుసార్లు అరెస్టు చేశారు.
సోమవారం నా తమ్ముడిని అకారణంగా అరెస్టు చేశారు. తాజాగా నా సోదరినీ అరెస్టు చేశారు. మేం ఏ తప్పు చేశామని ఇలా వేధిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే తనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే ఎర్రచందనం కేసు విషయంలోనూ ఆ దర్యాప్తు జరిపించాలని సవాల్ విసిరారు. సీఎం తీరుతో దళిత, గిరిజన, బలహీనవర్గాలు కాంగ్రెస్‌కు దూరమయ్యాయన్నారు.