రాహుల్‌ను ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించండి: శంకర్రావు
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రధానమంత్రి అభ్యర్ధిగా రాహుల్‌గాంధీ పేరును వెంటనే ప్రకటించాలని మాజీమంత్రి డాక్టర్ పి.శంకర్రావు కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. నరేంద్రమోడీ నియోజకవర్గంతోసహా దేశంలో ఎక్కడ రాహుల్‌గాంధీ పోటీ చేసినా ఆయన తరపున తాను ప్రచారం చేసి గెలిపిస్తానని చెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని, సీఎన్ఎన్-మార్గ్సహా వివిధ సర్వేల్లో వెల్లడైందన్నారు.
తెలుగు ప్రజలు కూడా రాహుల్గాంధీపట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపుతున్నందున, రాష్ట్రంలో కనీసం మూడు బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటే లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాబోయే సాధారణ ఎన్నికలు ముందస్తుగా వచ్చే అవకాశాలున్నట్లు కన్పిస్తోందని, కేంద్ర మంత్రి శరద్‌పవార్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారని పేర్కొన్నారు. సీమాంధ్ర ఉద్యమం పేరుతో ఇప్పటి వరకు వందకుపైగా రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలను ధ్వంసం చేశారని, అయినప్పటికీ ప్రభుత్వం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తిరుపతిలో సోనియాగాంధీ ఫ్లెక్సీని కాల్చి అంతిమ సంస్కారాలు నిర్వహించినా సీఎం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను వెంటనే సీబీఐకి సమర్పించాలని కోరారు.