నందిగామ రూరల్/ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్ : ప్రకృతి ప్రకోపం అన్నదాతల పాలిట శాపంగా మారుతుంది. ఓ సారి అతివృష్టి, మరోసారి అనావృష్టి కారణంగా రైతు ఏఏటికాయేడు నష్టాలను మూటకట్టుకుంటూనే ఉన్నాడు. సాగునీరు లేక పంటలన్నీ ఎండిపోయి వరుణుని కరుణ కోసం ఎదురుచూసిన రైతును సోమవారం కురిసిన భారీ వర్షం అతలాకుతలం చేసింది. పంట పొలాలన్నీ జలమయం అవటంతో కళ్లముందే నీటి పాలైన పంటను చూసి నందిగామ, మైలవరం, ఇబ్రహీంపట్నం మండలాల్లోని రైతులు కంటతడి పెడుతున్నారు. నందిగామ ప్రాంతంలో సోమవారం 15 సెంమీ అత్యధిక వర్షపాతం నమోదైంది. ఐతవరం బందపు వాగు పొంగటంతో కంచల గ్రామ పరిధిలోని సుమారు 200 ఎకరాలు వరి మాగాణి పూర్తిగా నీట మునిగింది. దోస, బీర సాగు చేసే దాదాపు 90 ఎకరాలకు పైగా నీట మునిగాయి. అలాగే ఇబ్రహీంపట్నంలోని ఏనుగుగడ్డ వాగు, ఉబ్బడివాగు పొంగి ప్రవహిస్తున్నాయి. రెండోరోజు మంగళవారం ఇవి ఉధృతరూపం దాల్చటంతో మండలంలోని పలు గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. కొటికలపూడి వంతెన వద్ద సోమవారం రాత్రి నీటి ప్రవాహం భారీస్థాయిలో పెరగటంతో అధికారులు రాకపోకలను పూర్తిగా నిలిపేశారు.
ప్రజలను చేరవేసేందుకు పంచాయతీ ఏర్పాటు చేసిన ట్రాక్టర్ కూడా నీటిలో తిరగలేని పరిస్థితి నెలకొంది. దీంతో అర్థరాత్రి వరకు తాహశీల్దార్ ఎం. మాధురి పరిస్థితులను సమీక్షించారు. మంగళవారం ఉదయం తాహశీల్దార్ మాధురి, ఎంపీడీవో లక్ష్మీకుమారి పడవలు వస్తున్నాయంటూ గ్రామస్తులను నీటిలోకి దిగకుండా ఆపారు. అయితే అధికారుల మాటలను లెక్కచేయకుండా నడుంలోతు నీటిలో వాగును దాటి గ్రామస్తులు బయట పడ్డారు. చిలుకూరు వద్ద వాగుపొంగటంతో చిలుకూరు, దాములూరు, కొత్తపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చిలుకూరు, కేతనకొండ, కొటికలపూడి, మూలపాడు గ్రామాల్లో సుమారు 70ఎకరాల్లో పత్తిపొలాలు నీటమునిగాయి. ఏనుగుగడ్డ వాగులో 25గొర్రెలు కొట్టుకుపోయాయి. సోమవారం రాత్రి చిలుకూరు వంతెన వద్ద ఈ ఘటన జరిగింది.
పరిటాలకు చెందిన అల్లాడి వెంకటేశ్వరరావు, వీర్ల గంగయ్య, పొదిలి వెంకటేశ్వరరావు, కాళింగి శ్రీనివాసరావు వారికి చెందిన సుమారు వంద గెర్రెలను నిత్యం చిలుకూరు సమీపంలో మేతకు తీసుకొస్తారు. ఎలాగైనా వాగుదాటి ఇళ్లకు చేరాలనే ఆతృతలో గొర్రెలను వాగులోకి దింపారు. దీంతో గొర్రెలు వాగుఉధృతికి కొట్టుకుపోయాయి. వాగును చూసేందుకు వచ్చిన చిలుకూరు యువకులు సాహసంచేసి సమీపంలోని ముళ్లపొదలు, జామాయిల్ తోటల్లో చిక్కుకున్న కొన్నింటిని రక్షించ గలిగారు. ఆరు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కాగా మధ్యాహ్నం నుంచి అధికారులు పడవలను ఏర్పాటు చేశారు. కార్యదర్శి రాజారావు, వెంకటేశ్వరరావు, వీఆర్ వోలు కృష్ణయ్య, ఖాసీం, సుబ్రహ్మణ్య ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
5
చెరువులుగా మారిన పంటపొలాలు
Published Wed, Aug 14 2013 4:15 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement