ఇచ్చోడ మండలం బోరిగామలో దారుణం
అదనపు కట్నం కోసం హత్య
ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం
వరకట్నం కోరలకు ‘పద్మ’ం రాలిపోయింది. వేలుపట్టుకుని ఏడడుగులు నడిచి కలకాలం తోడుంటానని బాస చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం భార్యను కిరాతకంగా హత్య చేయడమే కాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిం చాడు. గొడ్డును బాదినట్లుగా బాది చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఇచ్చోడ మండలం బోరిగామలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఇచ్చోడ, న్యూస్‌లైన్ : అదనపు వరకట్నం కోరలకు ‘పద్మ’ం రాలిపో యింది. భర్త కట్న దాహానికి నిలువెల్లా కాలి అగ్ని ఆహుతైంది. భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. ఈ సంఘటన మండలంలోని బోరిగామ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. బోథ్ సీఐ మోహన్, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బజార్‌హత్నూర్ మండల కేంద్రానికి చెందిన లస్మన్న కూతురు పద్మ(26)కు మండలంలోని బోరిగామ గ్రామానికి చెందిన నరేశ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. రూ.40వేలు, రెండు తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. ఏడాది వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. కూలీ పనులు చేసే నరేశ్ కొన్ని రోజులుగా చెడు అలవాట్లకు బానిసయ్యాడు. అదనపు కట్నం కోసం తరచూ పద్మను వేధిస్తున్నాడు. తన తల్లిదండ్రులు అదనపు కట్నం ఇచ్చే స్థితిలో లేరని పద్మ విన్నవించినా పట్టించుకునేవాడు కాదు. భర్త వేధింపులు తాళలేక పద్మ ఐదు నెలలు తల్లిగారింట్లోనే ఉంది. అదనపు కట్నం కోసం ఇక వేధించనంటూ ఇటీవల భార్యను కాపురానికి తీసుకెళ్లాడు. శనివారం ఉదయం కట్నం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
పుట్టింటికి వెళ్లిపోతానంటూ పద్మ తన ఆరు నెలల కూతురిని తీసుకుని ఆటో స్టాండ్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లిన నరేశ్ ఆమెను కొట్టుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో కూడా చితకబాదడంతో పద్మ చనిపోయిందని సీఐ తెలిపారు. నరేశ్ వెంటనే పద్మ మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న బాత్రూం వద్ద పడుకోబెట్టి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కల వారు, గ్రామస్తులు చూసేసరికి పద్మ కాలిబూడిదైంది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై బి.సంజీవ్ సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి తండ్రి లస్మన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
రాలిన ‘పద్మ’ం
Published Sun, Feb 2 2014 2:34 AM | Last Updated on Fri, May 25 2018 12:54 PM
Advertisement
Advertisement