ఇంటికి పెయింటింగ్ చేస్తూ చోరీ
కడప అర్బన్ : కడప నగరంలోని తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో గత నెల 17న పుల్లగూర హరికృష్ణ అనే అధ్యాపకుని ఇంటిలో పెయిటింగ్ పని చేస్తూ దొంగతనానికి పాల్పడిన కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అర్బన్ సీఐ సదాశివయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ బాల మద్దిలేటి తమ సిబ్బందితో కలిసి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సీఐ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 17న నిందితులలో ఒకరైన పద్మాకర్‌రాజు అలియాస్ బాబు చెమ్ముమియాపేటలో నివాసముంటున్న పుల్లగూర హరికృష్ణ ఇంటిలో పెయిటింగ్ పనికి వెళ్లాడని తెలిపారు. ఇంటిలో ఎవరూ లేని విషయాన్ని గమనించి కప్ బోర్డులో ఉన్న తాళాలు తీసుకుని బీరువా తెరిచి 80 గ్రాముల బరువు ఉన్న ఒక బంగారు నెక్లెస్, రెండు జతల కమ్మలు, ఒక సాదా బంగారు కమ్మ, బంగారు జడబిల్లను దొంగలించుకుని తీసుకున్నాడన్నారు.
ఈ విషయమై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడప తాలూకా పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. విచారణలో భాగంగా తమకు అందిన సమాచారం మేరకు డీఎస్పీ అశోక్‌కుమార్ పర్యవేక్షణలో రాజంపేటలోని బీఎస్ హాలు రాజీవ్‌నగర్‌లో నివసిస్తున్న మిడుతూరి పద్మాకర్‌రాజు అలియాస్ బాబు, కడప చిన్నచౌకు ఇన్నారెడ్డి స్కూలు వీధికి చెందిన బిల్లా రమణయ్య అనే ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశామన్నారు. దొంగతనానికి పాల్పడిన పద్మాకర్‌రాజు తన స్నేహితుడైన రమణయ్యతోపాటు కలిసి సదరు బంగారు ఆభరణాలను శంకరాపురంలోని కెనరా బ్యాంకులో ఆటో డ్రైవర్ భార్య పేరు మీద రూ. 97 వేలకు కుదవకు పెట్టారని పేర్కొన్నారు. ఆ బంగారు ఆభరణాలను రికవరీ చేశామన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో హెడ్ కానిస్టేబుళ్లు అగ్రహారం శ్రీనివాసశర్మ, మల్లికార్జున, మురళి, కానిస్టేబుళ్లు రామాంజనేయులు, శ్రీకాంత్, రఫీలు పాల్గొన్నారు.