- రూ.2 లక్షల నగదు, బంగారం, వెండి నగలు దోపిడీ
- ఇంటిని పరిశీలించిన పోలీసుఅధికారులు
ధర్మవరంలో చోరీ
Published Sat, Oct 15 2016 10:03 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
ప్రత్తిపాడు :
ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో చోరీ జరిగిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లి శుక్రవారం రాత్రి స్వగ్రామం వచ్చారు. తాళం తెరిచి, ఇంటిలో ప్రవేశించిన వారు చోరీ జరిగిన సంగతిని గుర్తించారు. ధర్మవరం గ్రామానికి చెందిన ఆదర్శ విద్యాలయం కరస్పాండెంట్ దాడి చిన్నారావు పాఠశాలకు దసరా సెలవుల కారణంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల ఐదో తేదీన హైదరాబాద్ వెళ్లారు. శుక్రవారం రాత్రి ఇంటి వచ్చారు. ఇంటి ప్రధాన గేటు తాళం తీసుకుని, ఇంటిలోకి ప్రవేశించగా, పడక గది తాళం బద్దలకొట్టి ఉండడం, బీరువా తలుపులు తెరిచి ఉండడంతో 100 నంబర్‌కు ఫిర్యాదు చేశానని చిన్నారావు విలేకరులకు తెలిపారు. అగంతకులు ప్రధాన ద్వారం పక్కనే ఉన్న కిటికీ గ్రిల్స్‌ను తొలగించి, లోనికి చొరబడి, రూ.2 లక్షల నగదు, రూ.1.5 లక్షల విలువ చేసే 9.5 కాసుల బంగారు నగలు, 50 తులాల వెండి వస్తువులతోపాటు కెమెరా, వాచీ, సెల్‌ఫోన్ చోరీకి గురయ్యినట్టు గమనించారు. ఈ మేరకు దాడి చిన్నారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్, ప్రత్తిపాడు సీఐ జి.సత్యనారాయణ, ఎస్సై ఎం.నాగదుర్గారావు శనివారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. ప్రత్తిపాడు సీఐ జి.సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement