పల్లెల్లో ఉప పోరు
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో పంచాయతీ పోరుకు మళ్లీ తెరలేవనుంది. 2013 సంవత్సరంలో ఎన్నికలు జరగని స్థానాలతో పాటు, పదువులు దక్కించుకున్న అనంతరం మరణించిన వారి స్థానాలను భర్తీ చే సేందుకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మూడు సర్పంచ్, 31వార్డుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. తొలుతుగా పోలింగ్‌స్టేషన్‌ల జాబితాను ప్రకటించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఆ పనిలో పడ్డారు.
అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం ఈనెల 19న పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ ఏడాది మార్చి 10న ప్రకటించిన ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికలు నిర్వహించనున్నారు. 2013 సంవత్సరంలో పంచాయతీ ఎన్నికల నిర్వహించిన సందర్బంలో వినియోగించిన గుర్తులనే ఈ ఎన్నికలకు కేటాయించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏర్పాట్లు పూర్తి చేస్తే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని ఆదేశాల్లో పేర్కొంది. అలాగు బడ్జెట్‌ను సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పంచాయతీ అధికారులు ఉప పోరుకు సన్నాహాలు చేసే పనిలో పడ్డారు.
ఎన్నికలు జరిగే స్థానాలు
లక్కవరపుకోట మండలం ఖాసాపేట పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తి గత ఏడాది మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. కొత్తవలస మండలం వియ్యంపేట, సీతానగరం మండలం జోగింపేట పంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ రెండు స్థానాలకు అధికారులు కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం పోటీ చేసేందుకు ఏ ఒక్క అభ్యర్థీ ముందుకు రాకపోవడంతో ఎన్నికలు జరగని పరిస్థితి నెలకొంది. అయితే ఈ సారి కూడా అవే రిజర్వేషన్‌లు అమలవుతాయని అధికారులు చెబుతుండడంతో అదే పరిస్థితి పునరావృతం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పంచాయతీల్లోని 31 వార్డు అభ్యర్థుల ఎన్నిక జరగనుంది.
ఇందులో చీపురుపల్లి మండలం పెదనడిపల్లి పంచాయతీ పరిధిలో గల 10వ వార్డు, చీపురుపల్లి మేజర్ పంచాయతీలో 8వ వార్డు స్థానానికి, ఇదే మండలంలో గల నిమ్మలవలస పంచాయతీ 4వ వార్డుకు ఉప ఎన్నిక జరగనుంది. బొండపల్లి మండలం జి.పి.అగ్రహారం పంచాయతీ పరిధిలో గల 3వ వార్డు, గుర్ల మండలం ఎస్‌ఎస్‌ఆర్‌పేట పంచాయతీలో గల 9వ వార్డు, గుర్ల మండలం గూడెం పంచాయతీలో 8వ వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గంట్యాడ మండలం రావివలస పంచాయతీలో 8వ వార్డుకు, దత్తిరాజేరు మండలం ఎస్‌బూర్జవలస పంచాయతీలో 4వ వార్డుకు, లక్కవరపుకోట మర్లపల్లి పంచాయతీలో 8వ వార్డుకు, కొత్తవలస మేజర్ పంచాయతీలో మొదటి వార్డు ఎన్నికలు జరిగే జాబితాలో ఉన్నాయి.
సాలూరు మండలం నేరళ్లవలస పంచాయతీలో 7వ వార్డు, సీతానగరం మండలం బక్కుపేట పంచాయతీలో 7వ వార్డు , సీతానగరం మండలం జోగింపేట పంచాయతీలో 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బలిజిపేటమండలం బర్లి పంచాయతీలో 1వ వార్డు, బొబ్బిలి మండలం జగన్నాథపురం పంచాయతీలో 5వ వార్డు, బొబ్బిలి మండ లం ఎంబూర్జవలస పంచాయతీలో 8వ వార్డు, జియ్యమ్మవలస మండలం చింతలబెలగాం పంచాయతీలో 4వ వార్డు, రామభద్రాపురం మండలం గొల్లపేట పంచాయతీలో 6వ వార్డుకు, గరుగుబిల్లి మండలం పెద్దూరు పంచాయతీలో 4వ వార్డు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మెంటాడ మండలం ఉద్దంగి పంచాయతీలో 3వ వార్డు, పూసపాటిరేగ మండలం చింతపల్లి పంచాయతీలో 4, 12 స్థానాలకు, నెల్లిమర్ల మండలం దన్నానపేట పంచాయతీలో 5వ వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.