గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)లో విలీనం కాని 17 పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది.
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)లో విలీనం కాని 17 పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలోని 14 పంచాయతీలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని 3 పంచాయతీలకు ఈ నెల 21వ తేదీన ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్‌ఎంసీలో విలీనం కాని ఈ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ కొంపల్లికి చెందిన కొందరు వ్యక్తులు హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన దరిమిలా ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం.
ఈనెల 6న ఆయా జిల్లా కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అదే రోజు నుంచి 10వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. 11న నామినేషన్ల పరిశీలన, 12న తిరస్కృత నామినేషన్లపై అప్పీళ్ల దాఖలు, 13న అప్పీళ్ల పరిశీలన, 14న నామినేషన్ల ఉపసంహరణ జరుగుతాయి. పోలింగ్ జరిగే 21వ తేదీనే ఫలితాల ప్రకటనతోపాటు, ఉపసర్పంచ్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు.
రంగారెడ్డి జిల్లాలో ఎన్నికలు జరిగే పంచాయతీలు: కుత్బుల్లాపూర్ మండలంలో కొంపల్లి, ప్రగతినగర్, దూలపల్లి, కీసర మండలంలో నాగారం, దమ్మాయిగూడెం, ఘట్‌కేసర్ మండలంలో చెంగిచెర్ల, మేడిపల్లి, బోడుప్పల్, రాజేంద్రనగర్ మండలంలో మణికొండ జాగీర్, కోకాపేట, మంచిరేవుల, గండిపేట, మేడ్చెల్ మండలం గుండ్లపోచంపల్లి, శామీర్‌పేట మండలంలో జవహర్‌నగర్ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్‌పేట మండలంలోని తాడిపర్తి, వనపర్తి మండలంలోని నాగవరం, శ్రీనివాసపురం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.