విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: జిల్లాలో మలి విడత పంచాయతీ పోరుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేపాడ మండలం గుడివాడ, సాలూరు మండలం పురోహితునివలస సర్పంచ్ స్థానాలతో పాటు జిల్లాలో వివిధ గ్రామ పంచాయతీల్లో ఏడు వార్డు స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహించనున్నారు.
సర్పంచ్ స్థానాలకు నలుగురు, వార్డు మెంబర్ స్థానాలకు 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ వి.సత్యసాయిశ్రీనివాస్ తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించటం తో పాటు వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. అదే రోజున ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తి చేయాల్సి ఉంది.
పోలింగ్‌ను సంబంధిత మండలాభివృద్ధి అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయించారు. గత సంవత్సరం జూలైలో ఎన్నికలు జరగని నాలుగు పంచాయతీ, 75 వార్డు స్థానాలకు ఈ నెల 3 నుంచి ఆరో తేదీ వరకు అభ్యర్థుల నుం చి నామినేషన్లు స్వీకరించగా మొత్తం 107 నామినేషన్లు దాఖలయ్యా యి. ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి బరిలో కేవలం 18 మంది అభ్యర్థులు మాత్రమే మిగిలారు ఇందులో సర్పంచ్ స్థానాలకు నలుగురు, వార్డు స్థానాలకు 14 మంది పోటీపడుతున్నారు.
ఆ రెండు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు లేనట్లే...!
కొత్తవలస మండలం వియ్యంపేట, సీతానగరం మండలం జోగింపేట పంచాయతీలకు పాత పరిస్థితే పునరావృతమైంది. వీటికి నామినేషన్లు దాఖలుకాకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. సర్పంచ్ అభ్యర్థిత్వానికి సంబంధించి రిజర్వేషన్ల కేటాయింపులు సరిగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయంలో తాము చేసేదేమీ ఉండదని, మరోసారి రెండు సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు.
నేడు మలివిడత పంచాయతీ పోలింగ్
Published Sat, Jan 18 2014 4:28 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM
Advertisement