
పడకేసిన పాలన
గ్రామ పంచాయతీల్లో పాలన పడకేస్తోంది.కార్యదర్శుల కొరతకు తోడు ఉన్న కార్యదర్శులకే రెండు, మూడు పంచాయతీల్లో అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు.
పంచాయతీల్లో కార్యదర్శుల కొరత
ఒక్కొక్కరిపై పలు గ్రామాల బాధ్యత
అనేక అదనపు విధులతో సతమతం
అందుబాటులో లేక ప్రజలకు ఇక్కట్లు
గ్రామ పంచాయతీల్లో పాలన పడకేస్తోంది.కార్యదర్శుల కొరతకు తోడు ఉన్న కార్యదర్శులకే రెండు, మూడు పంచాయతీల్లో అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. సమీక్షలు, స్వచ్ఛభారత్, వీడియో కాన్ఫరెన్స్‌ల వంటి ఊపిరి సలపని పనుల్లో వారూ అందుబాటులో లేకుండా పోతున్నారు. దీనితో పంచాయతీ కార్యాలయాలకు పనుండి వచ్చే ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అమలాపురం :జనన, మరణాల ధృవీకరణ పత్రాలు, ఫీజు రీ యింబర్స్‌మెంట్‌కు అవసరమైన నివాస ధృవీకరణ, బెయిల్‌లకు అవసరమై సాల్వెన్సీల వంటి అవసరాలకు; పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి లైట్ల నిర్వహణ వంటి వాటికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి గ్రామాల ప్రజలు పరుగు పెట్టేది పంచాయతీల వద్దకే.
తమ సమస్యలను చెప్పుకోవాలన్నా, ధృవీకరణ పత్రాలు పొందాలన్నా కార్యదర్శులు అందుబాటులో లేక ప్రజలు పడిగాపులు పడాల్సి వ స్తోంది.జిల్లాలో 964 పంచాయతీలుండగా, సుమారు 300 వరకు కార్యదర్శుల ఖాళీలున్నాయి. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయని ప్రభుత్వం పక్క పంచాయతీల కార్యదర్శులకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగిస్తోంది. ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీలకు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొందరైతే ఏకంగా పక్క మండలాల్లోని పంచాయతీలన్నింటికీ ఇన్‌చార్జిగా భారం మోయాల్సి వస్తోంది. ఉన్న పనులకు తోడు ఇటీవల కేంద్రం చేపట్టిన స్వచ్ఛభారత్, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినస్మార్ట్ విలేజ్‌లు, ఆపై ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లు, ఎంపీడీఓలు నిర్వహించే సమీక్షా సమావేశాలు, ప్రతి సోమవారం ఒక పూట గ్రీవెన్స్‌సెల్.. చెప్పుకుంటూ పోతే కార్యదర్శుల విధులు కోకొల్లలు.
కనిపించడమే అరుదు..
కార్యదర్శులు తాము పనిచేసే గ్రామంలోకన్నా మండల కేంద్రంలో, ఇన్‌చార్జిలుగా పనిచేస్తున్న గ్రామాల్లో ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. దీనితో పంచాయతీ కార్యాలయాల్లో కార్యదర్శుల దర్శనమే గగనంగా మారింది. ప్రజలు వివిధ పనుల కోసం పంచాయతీలకు వెళ్లడం, కార్యదర్శులు లేక ఉసూరుమంటూ వెనుదిరగడం ఆనవాయితీగా మారింది. ప్రజలకే కాక పంచాయతీల పాలనకు సైతం కార్యదర్శుల కొరత పెద్ద అవాంతరంగా మారింది. పన్నుల వసూళ్లు కుంటుపడుతున్నాయి. మంచినీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణలో సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కారం కావడం లేదు. పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. స్వైన్‌ఫ్లూ విజృంభిస్తున్న తరుణంలో పేరుకుపోతున్న అపరిశుభ్రత ప్రజలను బెంబేలెత్తిస్తోంది.
అమలుకాని జీఓ : 199..
పంచాయతీ కార్యదర్శులు పనిచేసే గ్రామాల్లోనే ఉంటే ప్రజలకు మెరుగైన సేవలందుతాయనే ఉద్దేశంతో 2007 మే 8న జీఓ :199 విడుదలైంది. అంతకుముందు 2004లో సైతం ఇదే జీఓ విడుదలైంది. కార్యదర్శి పనిచేసే గ్రామంలో ఉండకపోతే ఇచ్చే ఇంటి ఆలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ) నిలిపివేయాలని జీఓలో స్పష్టంగా పేర్కొన్నారు. హెచ్‌ఆర్‌ఏ నిలిపివేసే అధికారాన్ని ఈవోపీఆర్డీలకు, ఎంపీడీఓలకు ఇచ్చారు. అయితే ఈ జీఓను కార్యదర్శులు కానీ, అమలు చేయాల్సిన అధికారులు కానీ పట్టించుకోలేదు. తాజాగా గత ఏడాది డిసెంబరులో జీఓను అమలు చేయాలని అన్ని మండల పరిషత్ కార్యాలయాలకు జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి సర్క్యులర్ జారీ అయింది. ఈ క్రమంలోనే జీఓ అమలుకు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడీ వస్తోంది. అయితే అదనపు బాధ్యతల పేరుతో మోయలేని భారం మోపి, ఇటువంటి నిబంధనలతో తమను ఇబ్బందుల పాల్జేయవద్దని కార్యదర్శులు కరాఖండిగా చెపుతుండడంతో ఉన్నతాధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రభుత్వం ఇటువంటి నిబంధనలను అమలు చేయాలనుకునే ముందు ఖాళీ పోస్టులు భర్తీ చేయడం సముచితం. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా 1016 కార్యదర్శుల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటిస్తోందే తప్ప ఆచరణకు పూనుకోవడం లేదు. అవసరాల మేరకు కార్యదర్శులను నియమించనంత కాలం పంచాయతీల్లో పాలన సారథి లేని రథగమనంలాగే ఉండక తప్పదు.