అమెరికన్ పార్సిల్‌లో పిచ్చికాగితాలు !
- ఐ-ఫోన్‌కు బదులు ఖాళీ పెట్టె
జగ్గయ్యపేట : అమెరికా నుంచి వచ్చిన ఒక రిజిస్టర్ ఎయిర్ మెయిల్ పార్సిల్‌లో ఐ ఫోన్‌కు బదులు పిచ్చి కాగితాలు వచ్చిన సంఘటన పేట పట్టణంలో గురువారం రాత్రి చోటు చేసుకోవడంతో బాధితుడు ఆరో వార్డు కౌన్సిలర్ ఇంటూరి రాజగోపాల్ (చిన్నా) అవాక్కయ్యారు. వివరాలలోకి వెళితే చిన్నా బంధువు అమెరికాలో ఉంటున్నారు.
గతనెల 23న బంధువు కట్టా శ్రీనివాసరావు రూ.60 వేలు విలువ కలిగిన ఐ ఫోన్ (ఎఫ్-5) ను అమెరికా నుంచి జగ్గయ్యపేటకు రిజిస్టర్ ఎయిర్‌మెయిల్ ద్వారా చిన్నాకు పంపారు. గురువారం రాత్రి జగ్గయ్యపేట పోస్టాఫీసు ద్వారా పార్సిల్ చిన్నా ఇంటికి వచ్చింది. దాన్ని తెరచి ఓపెన్ చేసి చూడగా అందులో ఫోన్‌కు బదులుగా పోన్‌బాక్సులో పిచ్చి కాగితాలు ఉండటంతో అవాక్కయ్యారు.
వెంటనే బంధువుకు ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. ఈ విషయాన్ని పేట సబ్ పోస్టు మాస్టర్‌కు తెలియజేసి, పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా ఫోన్ మిస్సింగ్ పోస్టాఫీసులో జరిగిందా లేక కస్టమ్స్ అధికారుల వైఫల్యమా తేలాల్సి ఉంది.