పసిడిపై ‘ఉత్తరకొరియా బాంబు’ మెరుపు
► అంతర్జాతీయ మార్కెట్‌లో 10 డాలర్లపైగా అప్
► దేశీయంగా రూ.30,000 పైకి...
న్యూయార్క్/ముంబై: ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబు ప్రయో గం, అమెరికా హెచ్చరికలు తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సురక్షితమైన సాధనంగా తిరిగి పసిడి వైపు చూడ్డం ప్రారంభించారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్ నైమెక్స్‌లో సోమవారం ఒక దశలో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గత శుక్రవారం ముగింపుతో పోల్చితే 15 డాలర్లు పెరిగి 1344 డాలర్లకు చేరింది. కడపటి సమాచారం మేరకు 10 డాలర్లు ఎగసి 1340 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
దేశీయంగా రూ.355 అప్: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో... ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత పసిడి 10గ్రాముల ధర శుక్రవారం ముగింపుతో పోల్చితే, రూ.355 పెరిగి రూ.30,260కి చేరింది. 99.5 స్వచ్ఛత సైతం ఇదే స్థాయిలో పెరిగి రూ. 30,110కి ఎగసింది. వెండి కేజీ ధర రూ. 650 ఎగసి రూ. 40,645కు చేరింది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి ధర గత వారంలో రూ.656 పెరిగ్గా, సోమవారం ధర కడపటి సమాచారం అందేసరికి రూ. 277 లాభంతో రూ. 30,100 వద్ద ట్రేడవుతోంది.