కలసి సాగితే అద్భుతాలే..!
► ప్రపంచ శ్రేయస్సే భారత్, అమెరికా లక్ష్యం: మోదీ
► వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికలో వ్యాసం
వాషింగ్టన్: ఉగ్రవాదం, అతివాద భావజాలం, భద్రతా ముప్పు నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకే భారత్ –అమెరికాలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయని, ప్రపంచ శ్రేయస్సే ఇరు దేశాల లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రికకు వ్యాసం రాస్తూ.. భారత్, అమెరికాలు కలసికట్టుగా సాగితే ప్రపంచానికి అద్భుత ఫలితాలు అందుతాయని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు వివాదరహితమన్నారు. ఆ వ్యాసంలోని ముఖ్యాంశాలు..
‘ఊహించిన దాని కంటే భారత్, అమెరికాలు మరింత లోతైన, దృఢమైన భాగస్వామ్యం దిశగా సాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో... ఆర్థిక వృద్ధి, మార్పు కోసం పరస్పరం సహకరించుకోవాలనే ఆసక్తితో ఇరు దేశాలున్నాయి. ఇరుదేశాల మధ్య కొనసాగిన అపనమ్మకాలు తొలగిపోయాయని గత జూన్‌లో వాషింగ్టన్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ ఉభయ సభల్లో చెప్పాను.
ఇరు దేశాల మధ్య పలు అంశాల్లో ఏకాభిప్రాయం నెలకొంటున్న వేళ ఏడాది అనంతరం మళ్లీ అమెరికాకు వచ్చా. రెండు దేశాల మధ్య పటిష్టమైన ఉమ్మడి విలువలు, వ్యవస్థల్లో స్థిరత్వం వల్లే ఈ నమ్మకం సాధ్యమైంది. రాజకీయ విలువల పట్ల పరస్పర నమ్మకం, పరస్పర శ్రేయస్సు విషయంలో దృఢమైన విశ్వాసంతో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు సాధ్యమయ్యాయి.
రక్షణలో పరస్పర ప్రయోజనాలే కీలకం
ఎప్పుడైతే భారత్, అమెరికా కలసికట్టుగా సాగుతాయో.. ప్రపంచం మంచి ఫలితాలు పొందుతుంది. రోటా వైరస్, డెంగ్యూ, సైబర్ స్పేస్ నిబంధనలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో విపత్తు నివారణ, ఆఫ్రికాలో శాంతిదళాలకు శిక్షణ వంటి రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. రక్షణ రంగంలో పరస్పర ప్రయోజనం మేరకు భారత్ అమెరికాలు ముందుకు సాగుతున్నాయి. ఇరు దేశాల్నే కాకుండా ఉగ్రవాదం, అతివాద భావజాలం నుంచి ప్రపంచాన్ని రక్షించడమే భారత్, అమెరికా ప్రథమ కర్తవ్యం. అఫ్గానిస్తాన్, పశ్చిమాసియా, ఇండో– పసిఫిక్ సముద్ర ప్రాంతం, సైబర్ స్పేస్ రంగంలో ప్రమాదాల్ని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాం.
జీఎస్టీ మంచి అవకాశం
భారత్, అమెరికా మధ్య వార్షిక వాణిజ్యం విలువ 11,500 కోట్ల డాలర్లు దాటింది. అమెరికాలో ఉత్పత్తి, సేవా రంగాల్లో అనేక భారతీయ కంపెనీలు.. అమెరికాలోని 35 రాష్ట్రాల్లో మొత్తం 1,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. అలాగే అమెరికన్ కంపెనీలు భారత్‌లో దాదాపు 2,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.. జీఎస్టీ ద్వారా భారత్ ఏకీకృత పన్ను వ్యవస్థగా మారనుంది. ఈ భారీ మార్పులు అమెరికా వ్యాపారవేత్తలకు విస్తారమైన వాణిజ్య, పెట్టుబడుల అవకాశాల్ని కల్పిస్తాయి.
100 స్మార్ట్ సిటీల నిర్మాణం, ఓడరేవులు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే వ్యవస్థల భారీ ఆధునికీకరణ, 2022 నాటికి అందరికీ గృహాకల్పన వంటివి కేవలం పట్టణ వ్యవస్థ ఆధునికీకరణకే కాకుండా.. ఇరుదేశాలకు భారీ ఉపాధి అవకాశాల్ని కల్పిస్తాయి. ఇరుదేశాల మధ్య డిజిటల్, శాస్త్ర రంగంలో సహకారం నెలకొనేందుకు.. నూతన సాంకేతికత, ఆవిష్కరణలు, నైపుణ్యమున్న ఉద్యోగులు సాయపడ్డారు. అమెరికాలోని 30 లక్షల మంది భారతీయ సమాజం ఇరుదేశాల క్షేమం కోసం పనిచేయడమే కాకుండా వారధిగా వ్యవరిస్తోంది.