
'అర్థాంతరంగా తొలగించాలని చూడటం దారుణం'
విజయవాడ:
కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడటం దారుణమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఆయన ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో 143వ జీఓ ద్వారా ఎనిమిది వేల మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను నియమించారని, ఇంటర్మీడియట్ వ్యవస్థకు వారే మూలస్తంభాలుగా నిలిచారని అన్నారు.
ఒక్కొక్కరూ పదేళ్ళ సీనియారిటీతో పనిచేస్తున్నారని, వారిని అర్థంతరంగా తొలగించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దపడుతోందని విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలోనే కాంట్రాక్ట్ లెక్చరర్లకు న్యాయం జరిగిందని, వారి జీతాలను రూ.9 వేల నుంచి రూ.18వేలకు పెంచిన ఘనత ఆయనదేనని అన్నారు. అంతేకాక వైఎస్ హయాంలోనే పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించారని కూడా గుర్తు చేశారు. ఎన్నికల్లో ఒప్పంద ఉద్యోగులకు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ కోసం చేసే ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు.