మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్‌సీపీ నేత పార్థసారధి
సాక్షి, విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు కొనసాగుతున్న ఉద్యమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నీరుగారుస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. ఏపీకి చెందిన మొత్తం ఎంపీల మూకుమ్మడి రాజీనామాలతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేలా చేద్దామని పిలుపునిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీతో కలిసి రావడం లేదంటూ మండిపడ్డారు. విజయవాడలో పార్థసారధి ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. తనపై నమోదైన కేసులపై విచారణ చేపడతానేమోనన్న భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. అందుకే హోదా పోరాటంలో బాబు వెనకడుకు వేస్తున్నారని ఆరోపించారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీ ఎంపీలతో రాజీనామా చేయించి హోదా పోరు ఉధృతం చేయాలంటూ చంద్రబాబుకు పార్థసారధి సవాల్ విసిరారు.
రాజీనామాలతోనే టీఆర్ఎస్ నేతలు తెలంగాణ సాధించుకున్నారని గుర్తుచేశారు. హోదా కోసం కలిసి రావాలంటే చంద్రబాబు మాత్రం వెనకడుకు వేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తేనే హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజంగా చంద్రబాబుకు ఏపీకి ప్రయోజనాలు చేకూర్చాలని, హోదా సాధించాలని చిత్తశుద్ధి ఉంటే మాత్రం ఇప్పటివరకూ చేస్తున్న మోసాలు, నాటకాలను ఇక ఆపాలంటూ పార్థసారధి హితవు పలికారు. ఇన్నేళ్లు ప్యాకేజీ జపం చేసిన చంద్రబాబు.. వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలతో యూ టర్న్ తీసుకుని ఇప్పుడు హోదా జపం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment