మెదక్ రూరల్, న్యూస్‌లైన్: మూడవ కాన్పులోనూ ఆడ బిడ్డే పుట్టిందని పొత్తిళ్లలో ఉండాల్సిన మూడు రోజుల పసికందును తల్లిదండ్రులు విక్రయానికి పెట్టిన సంఘటన మండల పరిధిలోని రాజీపేట పంచాయతీ కప్రాయిపల్లి తండాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన లకావత్ పీర్యా, విజ్యా దంపతులకు ఎస్న ఐదేళ్లు, అరుణ మూడేళ్ల ఇద్దరు ఆడబిడ్డలున్నారు. కాగా కుమారుడు కావాలని కోరుతున్న ఆ దంపతులకు మూడు రోజుల క్రితం జరిగిన కాన్పులోనూ మళ్లీ ఆడ బిడ్డేపుట్టింది. దీంతో ఆ దంపతులు తమకు పోషించే శక్తి లేదని, కాన్పునకు అయిన ఖర్చు రూ. 6 వేలు ఇచ్చి తీసుకు పోవచ్చని తండాలో పలువురికి తెలిపారు.
ఈ విషయం కప్రాయిపల్లి అంగన్‌వాడీ టీచర్ దృష్టికి రావటంతో ఆమె ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించింది. దీంతో విషయం తెలుసుకున్న శిశుసంరక్షణ జిల్లా అధికారి రత్నం, సీడీపీఓ విజయలక్ష్మి, సూపర్ వైజర్ వింధ్యావాహినిలు తండాకు చేరుకుని శిశువు తల్లిదండ్రులను ప్రశ్నించారు. వారు మాట్లాడారు. తమకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, మూడో కుమార్తెను పోషించే శక్తి లేదని తేల్చి చెప్పారు. పోషించే స్తోమత లేనప్పడు కు.ని ఆపరేషన్ చేయించుకోవచ్చ కదా అధికారులు ప్రశ్నించగా.. కుమారుడు కోసం ఎదురు చూశాం అని సమాధానం చెప్పారు. దీంతో అధికారులు మాట్లాడుతూ కనీసం వారం రోజులైనా తల్లి పాలు ఇవ్వండని, పొత్తిళ్ల పాపకు గేదె పాలు, డబ్బా పాలు పడితే ఆరోగ్యం క్షీణిస్తుందని, వారం తర్వాత వచ్చి తీసుకెళతామన్నారు. ఇందుకు వారు ససేమీరా అన్నారు. దీంతో చేసేది లేక అధికారుల ఆ పసిగుడ్డును సంగారెడ్డి శిశువిహార్‌కు తరలించారు.
ఆడశిశువులు.. అంగడి సరుకులు
పొత్తిళ్లలో ఉండాల్సిన ఆడశిశువులు అంగడి సరుకులవుతున్నారు. మండల పరిధిలోని వాడి పంచాయతీ మెట్టు తండాకు చెందిన లంబాడి రవి, అనితలకు మూడో కాన్పులోను ఆడ బిడ్డే పుట్టిందని మూడు నెలల క్రితం టేక్మాల్‌లోని ఓ తండాలో విక్రయించిన విషయం తెలిసిందే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే అధికారులు స్పందించి ఆ తరువాత పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. గిరిజనులు మగబిడ్డ కోసం రెండో పెళ్లి చేసుకున్న సందర్భాలు తండాల్లో కోకొల్లలు. ఒక వేళ ఆడపిల్లలు పుడితే ఇలా గుట్టు చప్పుడు కాకుండా అమ్మకానికి పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గిరిజనులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అమ్మకానికి బంగారుతల్లి
Published Wed, Mar 5 2014 11:45 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement