సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ పరిమల్ నత్వానీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్‌కు నత్వానీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నత్వానీ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తనను రాజ్యసభకు నామినేట్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రాభివృద్ధిపై చర్చిస్తానని అన్నారు. కాగా, నత్వానీ బుధవారం ఏపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
అంతకు ముందు నత్వానీ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఏ బాధ్యత అప్పగించి ముందుండి పూర్తిచేస్తానని చెప్పారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులను తీసుకురావడంలో సీఎం జగన్ చెప్పినట్లు పనిచేస్తూ సాధించుకుంటామని తెలిపారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా నత్వానీతో పాటు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, పార్టీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డిలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment