
సాక్షి, తాడేపల్లి : నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలకు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను వినిపించడానికి వారితో కలిసి పనిచేయడానికి తను ఎదురు చూస్తున్నట్టు సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్‌సీపీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని విజయం సాధించారు. (చదవండి : రాజ్యసభ ఎన్నికలు: వైఎస్సార్‌సీపీ ఘనవిజయం)
సీఎం జగన్‌ను కలిసిన కొత్తగా గెలిచిన ఎంపీలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కొత్తగా గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కలిశారు. అంతకు ముందు వారు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. ‘నా రాజకీయ జీవితంలో ఈరోజు మర్చిపోలేనిది. మండల ప్రెసిడెంట్‌గా నా రాజకీయ జీవితం ప్రారంభించాను. గ్రామస్థాయి నుంచి మంత్రి హోదా వరకు పనిచేశాను. ఇంత త్వరగా నాకు రాజ్యసభలో స్థానం వస్తుందని ఊహించలేదు. బీసీ కులంలో అగ్నికులక్షత్రీయుల నుంచి తొలిసారి.. రాజ్యసభలో నాకు సీఎం వైఎస్ జగన్ స్థానం కల్పించారు. ప్రాంతీయ పార్టీల్లో బీసీలకు ఇలాంటి అవకాశమివ్వటం అరుదైన సంఘటన’ అని తెలిపారు.
నత్వాని మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవచేసే భాగ్యం నాకు కల్పించిన.. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. ఏపీ అభివృద్దికి నా వంతు కృషి చేస్తాను’ అని తెలిపారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. రాజ్యసభ అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. సీఎం వైఎస్ జగన్ నాకు సువర్ణ అవకాశమిచ్చారు. నా గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశమిచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. నా గెలుపుకు సహకరించిన ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు. రాష్ట్రానికి అవసరమైన విధంగా రాజ్యసభ సభ్యుడిగా నా వంతు కృషి చేస్తాను’ అని చెప్పారు.