బాబు ఆలోచనే స్వార్థపూరితం
Published Sun, Oct 20 2013 1:52 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు, న్యూస్‌లైన్ :రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆలోచనే స్వార్థపూరితమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు అన్నారు. చంద్రబాబునాయుడు చేసే ఆందోళనకు అర్థం లేదని దుయ్యబట్టారు. గుంటూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబునాయుడు మళ్లీ సమన్యాయమంటూ ఆందోళన చేపట్టడం మోసపూరితం కాదా అని ఆయన ప్రశ్నించారు.
ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఎటువంటి ఆందోళనలు చేయరాదని జీఓ ఉన్నా, చంద్రబాబు నాయుడు దీక్ష చేసేందుకు అనుమతి ఎలా లభించిందో ఆయనే చెప్పాలని నిలదీశారు. జైలులో నిర్బంధ ఆంక్షలు ఉన్నప్పుడే సమై క్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారనే ప్రచారాన్ని జూపూడి తీవ్రంగా ఖండించారు. సోనియాగాంధీనీ, కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన ఏకైక వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరేనన్నారు.
పదవుల కోసం కాకుండా ప్రజల కోసం నిలబడినందుకే ఆయన 16నెలలు పాటు జైలులో ఉండాల్సి వచ్చిందన్నారు. సుప్రీం కోర్టులో రెండు సార్లు బెయిల్‌పై పిటిషన్ వేస్తే బెయిల్ వచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సమైక్యాంధ్ర కోసం తొలి నుంచి చిత్తశుద్ధితో పోరాటం చేయటంతోపాటు పోరాటానికి కలిసొచ్చే పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీని సమావేశపరచాలని ఇప్పటికే రెండుసార్లు గవర్నర్‌ను కలిశామనీ, అయితే అసెంబ్లీని సమావేశపరిచేవిషయంలో గవర్నర్ చొరవచూపటం లేదన్నారు. అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
సమైక్య శంఖారావానికి మోకాలడ్డు
సమైక్య శంఖారావం సభను ప్రభుత్వం పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేసిందని జూపూడి తెలిపారు. అనుమతి కావాలని కోరగా ఏడు విషయాలను పరిగణలోకి తీసుకుని అనుమతి ఇవ్వలేమని పోలీసులతో సమైక్యావాదినని చెప్పుకునే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పించారన్నారు. సీమాంధ్రులు సభ నిర్వహిస్తే సీమాంధ్రలో ఉండే గూండాలు, రౌడీలు చెలరేగిపోయే ప్రమాదం ఉందని చెప్పి సభకు అనుమతి ఇవ్వలేదన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కలిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించగా అనుమతి లభించిందన్నారు.
చరిత్రలో మిగిలిపోయే విధంగా ఐదు లక్షల మందితో ఈ నెల 26న హైదరాబాద్‌లో సమైక్య శంఖారావాన్ని నిర్వహిస్తునట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే సీపీఎం, ఎంఐఎంలు సమైక్యాంధ్ర నినాదంతో పని చేసేందుకు అనుమతి తెలియజేశారన్నారు. విలేకరుల సమావేశంలో గుంటూరు నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షౌకత్,నాయకులు చాంద్‌బాషా, గులాంరసూల్, ముస్తఫా, రాతంశెట్టి సీతారామాంజనేయులు, సాంబశివరావు, విజయ్‌కిషోర్, పానుగంటి చైతన్య ఉన్నారు.
Advertisement
Advertisement