పశు‘భ్రాంతి’ | pashu kranthi scheme not implemented properly | Sakshi
Sakshi News home page

పశు‘భ్రాంతి’

Published Fri, Jan 31 2014 6:48 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

pashu kranthi scheme not implemented properly

  ని‘బంధనాల్లో’ పథకం
 అడ్డంకిగా ఇంటిగ్రేటెడ్ యాక్షన్‌ప్లాన్
 ఏడాది ముగుస్తున్నా కదలని యూనిట్లు
 
 ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్:
 పశుక్రాంతి పథకం పశు‘భ్రాంతి’గా మారింది. ని‘బంధనాల్లో’ చిక్కుకొని రైతుల దరిచేరడం లేదు. ఈ ఏడాది అమలులోకి వచ్చిన ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ ఈ పథకానికి ప్రతిబంధకంగా మారింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా యూనిట్లు మాత్రం ముందుకు కదలడం లేదు. జిల్లాకు 874 యూనిట్లు మంజూరు చేస్తే పదుల సంఖ్యకు మించకపోవడం పథకం అమలు తీరుకు అద్దం పడుతోంది. పథకానికి సంబంధించి రూ 3.16 కోట్ల నగదు కేటాయించినా పూర్తి స్థాయిలో వినియోగం కాక మూలుగుతున్నాయి. చివరకు అది రైతుల దరి చేరడం భ్రాంతిగానే మిగులుతోంది.
 
 దారిద్య్ర రేఖకు దిగువన ఉండి పాడి పరిశ్రమపై ఆధారపడిన రైతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పశుక్రాంతి పథకానికి శ్రీకారం చుట్టారు. పాడి పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహించడం, రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూడటం, పాల దిగుబడి మరింత పెంపొందించడం, తలసరి పాల వినియోగం పెంచడం ఈ పథకం ముఖ్యోద్దేశం. మొదట్లో ఈ పథకంపై రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. హర్యానా, కర్ణాటక వంటి ప్రాంతాల నుంచి పశువులను తీసుకురావడం, అవి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడకపోవడంతో రైతులు ముందుకు రాలేదు. క్రమేణా అవి కూడా ఇక్కడి వాతావరణానికి అలవాటు పడుతూ వస్తున్నాయి. హర్యానా నుంచి మొర్రా జాతి గేదెలు, కర్ణాటక  నుంచి జెర్సీ, హెచ్‌ఎఫ్ ఆవులను కొనుగోలు చేసి ఇక్కడి రైతులకు అందిస్తున్నారు. ఆ రెండు ప్రాంతాలకు చెందిన జాతుల్లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం వాటికే ప్రాధాన్యం ఇస్తోంది.
 
 పశుక్రాంతి కింద మూడు రకాల యూనిట్లను రైతులకు అందిస్తున్నారు. రెండు గేదెలతో లక్ష రూపాయల విలువైన యూనిట్‌ను ఇస్తున్నారు. ఇందులో 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. అంటే రైతు 50 వేలు చెల్లిస్తే సరిపోతుంది. దాణా, రవాణా, బీమా ఉచితంగా అందిస్తారు. మినీ డెయిరీ కింద ఐదు గేదెలున్న యూనిట్‌ను 2.50 లక్షల రూపాయలతో అందిస్తున్నారు. ఇందులో 25 శాతం సబ్సిడీ. మిగిలిన 75 శాతం రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ యూనిట్‌కు సంబంధించి దాణా, రవాణా, బీమా ఉచితంగా ఇవ్వడంతోపాటు సబ్సిడీపై గడ్డి కోసే యంత్రాన్ని కూడా అందిస్తున్నారు. మూడవది మీడియం డెయిరీ యూనిట్. ఈ యూనిట్ కింద 20 గేదెలు ఇస్తారు. వాటి విలువ 10 లక్షల రూపాయలు. రూ2.50 లక్షలను సబ్సిడీ కింద ఇస్తారు. దాణా, రవాణా, బీమా ఉచితంగా ఇవ్వడంతోపాటు సబ్సిడీపై గడ్డి కోసే యంత్రాన్ని అందిస్తారు.
 
 సీన్ మారింది...
 ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్‌తో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. గతంలో ఏ ప్రాంతానికి చెందిన వారినైనా లబ్ధిదారులుగా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఒక్కో మండలంలో ఒక్క గ్రామాన్ని ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద చేర్చడం వల్ల ఆ మండలంలోని మిగిలిన గ్రామాలను దూరం చేసినట్లయింది. దాంతో ఆ గ్రామంలోనే లబ్ధిదారులను గుర్తించాల్సి వస్తోంది. ఒకవైపు నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ లబ్ధిదారులు కరువయ్యారు. ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ మంచి ఉద్దేశంతో పెట్టినప్పటికీ పశుక్రాంతి వంటి పథకాలకు మాత్రం విఘాతంగా మారుతోంది. గ్రామాలు మారుకుంటూ తమ గ్రామానికి వచ్చేసరికి అప్పటి వరకు ఆసక్తి కనబరచిన రైతులు కూడా వెనక్కు తగ్గుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement