ఆ పలుకే బంగారం
సాక్షి, రాజమండ్రి :ప్రారంభించేది కేంద్ర ప్రభుత్వ పథకమే అయినా పుష్కర సన్నాహాల వేళ జిల్లాకు.. అందునా పుష్కరాలకు ప్రధాన వేదిక వంటి రాజమండ్రి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు సంబంధించి వరాల జల్లు కురిపిస్తారని భావించారు. అయితే పలుకే బంగారమైనట్టు- ఆయన తన ప్రసంగంలో పుష్కరాలకు సంబంధించిన ఊసే తేలేదు. జిల్లాకు సంబంధించిన ఏ విషయంపైనా నోరు మెదపలేదు. ఇలా వచ్చి జనధన పథకాన్ని ప్రారంభించి అలా వెళ్లిపోయారు. ఇటీవల ప్రతి చోటా చేస్తున్నట్టే.. కేంద్రాన్నీ, తననూ కీర్తించుకోవడానికే పరిమితమయ్యారు.
గురువారం రాజమండ్రి చెరుకూరి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ప్రధానమంత్రి జన-ధన యోజనను ప్రారంభించారు. లబ్ధిదారులకు పాస్ పుస్తకాలు, రూపీ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చంద్రబాబు సుమారు అరగంట ప్రసంగించారు. పుష్కరాలపై కీలక ప్రకటన చేస్తారని అటు జనం, ఇటు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ఆశించారు. చివరి వరకూ ఆ ప్రస్తావన తేకపోవడంతోపక్కనే ఉన్న రాజమండ్రి రూరల్, సిటీ ఎమ్మెల్యేలు ఓ కాగితంపై రాసి ఇచ్చారు. దాన్ని చూ సిన చంద్రబాబు ‘ప్రతిష్టాత్మకమై న పుష్కరాలు వస్తున్నాయి. గతంలో నేను చేసిన అభివృద్ధి తప్ప ఒక్క అడుగు ముందుకు పడలే ద’ని మాత్రమే అన్నారు. కేంద్రం సహకారం తో రాజమండ్రిని అభివృద్ధి చేస్తామన్నారు.
జిల్లాకు, రాజమండ్రికి కి తాబు
ఉభయగోదావరి జిల్లాలు దేశంలో ధాన్యాగారాలుగా పేరొందాయని, కానీ నేడు దిగుబడి తగ్గిపోయిందని చంద్రబాబు అన్నారు. ఇక్రిశాట్ సహకారంతో ఈ పరిస్థితిని అధిగమిస్తామన్నారు. పోలవరం పూర్తయితే జిల్లాలో కరువనేదే ఉండదని పేర్కొన్నారు. ‘రాజమండ్రి అంటే రాజమహేంద్రి గురుకొ స్తుంది. నన్నయ్య ఇక్కడి వాడు. తెలుగు భాష ఇక్కడే నుడికారాలు దిద్దుకుంది. ఎన్‌టీఆర్ అభిమానించే జిల్లా. కందుకూరి స్ఫూర్తితో ఎన్నో సంస్కరణలు ఇక్కడ నుంచే చోటు చేసుకున్నాయి’ అంటూ కొనియాడారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎంపీలు మురళీమోహన్, తోట నరసింహం, రవీంద్రబాబు, ఎమ్మెల్సీలు చైతన్యరాజు, రవికిరణ్‌వర్మ, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆకుల సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, మేయర్ రజనీ శేషసాయి, బీజేపీ జాతీయ కా ర్యవర్గసభ్యుడు సోము వీర్రాజు, జిల్లా అ ధ్యక్షుడు సూర్యనారాయణరాజు, మాజీ మం త్రులు మెట్ల సత్యనారాయణ, చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్, కలెక్టర్ నీతూ ప్రసాద్, జేసీ ముత్యాల రాజు, జన-ధన మిషన్ డెరైక్టర్ పి.వి.రమేష్, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆహ్వానం అందలేదని గన్ని అసంతృప్తి
ముఖ్యమంత్రి కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గన్ని కృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వి మానాశ్రయంలో కూడా తనను పోలీసులు అ డ్డుకున్నారని మండిపడ్డారు. తన వంటి ప్ర ముఖులను కూడా అడ్డగించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పట్ల కొందరు పార్టీనేతలు అనుచితంగా వ్యవహరిస్తున్నారని మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కార్యక్రమం సాగింది ఇలా..
చంద్రబాబు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.00 గం టలకు మధురపూడి విమానాశ్రయం చే రుకున్నారు. అక్కడి నుంచి 4.20 గం టలకు సభాస్థలికి చేరుకున్నారు. ఆంధ్రాబ్యాంకు సీఎండీ రాజేంద్రన్ మాట్లాడాక చంద్రబాబు ప్రసంగం ప్రారంభించి ఐదు గంటలకు పూర్తి చేశారు. తర్వాత ఆంధ్రా బ్యాంకు నుంచి జన-ధన యోజనలో ఖాతా తెరిచిన వెలుగుబంటి అమ్మాజీకి తొలి పాస్‌పుస్తకం, రూపీ కార్డు(డెబిట్ కార్డు) అందచేయడం ద్వారా సీఎం ఈ పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించారు. అనంతరం ఎస్‌బీహెచ్ ఖాతాదారు ఎం.అమ్మాజీకి, వివిధ బ్యాం కుల్లో ఖాతాలు పొందిన వారికి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం అభిమానులు అందించిన ఎన్‌టీఆర్, బసవతారకం చిత్రపటాన్ని స్వీకరించారు. అధ్యక్షత వహించిన ఆంధ్రా బ్యాంకు సీఎండీ రాజేంద్రన్ మాట్లాడుతూ 51 ప్రభుత్వ, ప్రైవేట్, సహకార బ్యాంకులు జన-ధనలో ఖాతాలు తెరిపిస్తున్నాయన్నారు. బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన చంద్రబాబు 5.20 గంటలకు మధురపూడి బయలేదేరి, 5.40 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు.