గుంటూరు వరకూ 15చోట్ల ఆగిన ఫలక్‌నుమా
గుంటూరు: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పరీక్షకు వెళ్లే అభ్యర్థులు, ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. ఫలితంగా 15 చోట్ల రైలు నిలిచిపోయింది. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు సెంటర్లలో ఆదివారం నిర్వహించిన ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసేందుకు పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి దాదాపు 50 వేల మంది అభ్యర్థులు వచ్చారు. ఉచిత పాస్‌లు, టికెట్లు విక్రయించిన రైల్వే శాఖ అభ్యర్థులకు అవసరమైన ప్రత్యేక రైళ్లను కానీ, ప్రత్యేక బోగీలను కానీ కేటాయించలేదు. వారంతా సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైల్లోని అన్ని బోగీల్లో కిక్కిరిసి ఎక్కారు. దీంతో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు రైలు ఎక్కేందుకు వీలు లేకపోయింది. నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల స్టేషన్లలో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు స్థానిక ప్రయాణికులకు మధ్య ఘర్షణ జరిగింది. పిడుగురాళ్లలో స్థానిక ప్రయాణికులపై ఇతర రాష్ట్రంనుంచి వచ్చిన అభ్యర్థులు రాళ్లతో దాడి చేశారని టికెట్ ఇన్‌స్పెక్టర్లు తెలిపారు. రైలు కిటీకీలు కూడా ధ్వంసమయ్యాయి.
సికింద్రాబాద్ నుంచి గుంటూరు చేరేలోగా మార్గ మధ్యంలో 15 చోట్ల రైలు నిలిచిపోయింది. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు రైలు ఎక్కే వీలు లేక ఆయా స్టేషన్లలోనే నిలిచిపోయారు. రైల్వే పోలీసుల అభ్యర్థన మేరకు గుంటూరు సివిల్ పోలీసులు రైలు గుంటూరు రైల్వేస్టేషన్ చేరుకునే సరికి అప్రమత్తమయ్యారు. రైల్వే, సివిల్ పోలీసులు మోహరించి రిజర్వేషన్ బోగీల్లో రిజర్వేషన్ లేని వారిని దించేందుకు యత్నించినా కొంతవరకే సఫలీకృతులయ్యారు. గుం టూరు నుంచి రిజర్వేషన్ చేసుకున్న వారిని ఎక్కించలేకపోయారు. దీంతో ఆందోళనకు దిగారు. అనంతరం విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో పంపారు.
ప్రయాణికులతో ఆర్‌ఆర్‌బీ అభ్యర్థుల ఘర్షణ
Published Mon, Jun 30 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM
Advertisement
Advertisement