
పసుపు కుంకుమ – 2 పేరిట ప్రభుత్వం ప్రచారార్భాటం చేస్తోంది. పైసల్లేకుండానే హంగామా చేస్తోంది. ఎన్నికల ముందు బేషరతుగా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని నమ్మబలికి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత ఆ హామీని అటకెక్కించేశారు. ఆ తర్వాత ఒక్కో డ్వాక్రా మహిళకు మూడు విడతల్లో రూ.10 వేలు జమ చేస్తానని చెప్పి చివరకు నాలుగు విడతల్లో అరకొరగా జమ చేశారు. డ్వాక్రా రుణమాఫీ హామీ అమలు చేయకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన అక్కాచెల్లమ్మలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ముందు వారిని సంతృప్తి పరిచి మళ్లీ ఓట్లు దండు కోవడమే లక్ష్యంగా మరోవిడత పసుపు – కుంకుమ పేరిట జిమ్మిక్కులు చేస్తున్నారు.
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో 45,724 సంఘాల్లో 4,88,004 మంది సభ్యులకు పసుపు కుంకుమ కింద రూ.381. 60 కోట్లు, వడ్డీ రాయితీ కింద 36,239 సంఘాలకు రూ.66.73కోట్లు నాలుగు విడతల్లో జమ చేశారు. ఇంకా జిల్లాలో సుమారు పదివేల మంది మహిళలకు మొదటి విడత పసుపుకుంకుమ నిధులు జమకాని పరిస్థితి. జిల్లాలో వేలాది సంఘాలు మాఫీ ఉచ్చులో పడడం వలన వడ్డీలతో తడిసిమోపెడైన అప్పులు చెల్లించలేక కోర్టు నోటీసులందుకుంటున్నారు. ఈ కారణంగానే ఇటీవల ప్రభుత్వం నిర్వహించే అభిప్రాయ సేకరణలో జిల్లాలో డ్వాక్రాసంఘాల్లో సంతృప్తి శాతం 53 శాతానికి మించి లేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే మళ్లీ వీరిని ఏమార్చేందుకు పసుపుకుంకుమ పేరిట మరో హైడ్రామాకు రాష్ట్ర ప్రభుత్వం తెర తీసింది.ఎన్నికల షెడ్యూల్‌విడుదలకు సరిగ్గా నెల రోజుల ముందు వార్ని మళ్లీ బుట్టలో వేసుకునేందుకు ఎత్తుగడ వేస్తోంది. తొలుత ఫిబ్రవరిలో రెండువిడతల్లో రెండో విడత పసుపుకుంకుమ జమ చేస్తామని కేబినెట్ సమావేశ సమయంలో ప్రకటించిన ప్రభుత్వ పెద్దలు గతంలో మాదిరిగానే నాలుగు విడతల్లో జమ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. నెలాఖరులోగా తొలివిడత కింద రూ.2,500లు, రెండో విడత రూ.2,500లు, మూడోవిడత కింద ఎన్నికల తర్వాత రూ.5వేలు జమ చేసేలా సర్కారు ఎత్తుగడలు వేస్తోంది. ఆ విధంగా వారిని మభ్యపెట్టాలని చూస్తున్నారు.
తొలి విడతతోనే సరి..
పసుపుకుంకుమ–2 కింద విశాఖ జిల్లాలో 49,883 సంఘాల పరిధిలోని 5,32,190 మంది మహిళలకు రూ.532.19కోట్లు మంజూరు చేయనున్నారు.కాగా ఈ మొత్తంలో విశాఖ సిటీలో 25,512 సంఘాల పరిధిలో ఉన్న 2.76లక్షల మంది సభ్యులకు, గ్రామీణజిల్లాలోని 39,883 సంఘాల్లోని 4,32,372 సభ్యులకు కలిపి తొలి విడత కింద ఈ నెలాఖరులోగా రూ.2500లు జమచేయనున్నారు. పసుపుకుంకుమ పథకం ప్రచారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సుల్లో భాగంగా ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల మహిళా సంఘాలతో శుక్రవారం నిర్వహించతలపెట్టిన ప్రాంతీయ సదస్సు కోసం విశాఖ ఏయూ ఇంజనీ రింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నాలుగు జిల్లా నుంచి కనీసం 50వేలమందిని తరలించాలన్న సంకల్పంతో 1200 ఆర్టీసీ బస్సులును మళ్లించారు.
ఇందుకోసం అక్షరాల రూ.2.70కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక సభకు వచ్చే డ్వాక్రా సభ్యులకు మధ్యాహ్న, రాత్రి భోజనాల పేరిట రూ.50లక్షలు ఖర్చు చేస్తున్నారు. టెంట్‌లు, ఇతర ఏర్పాట్లు కోసం కోటిన్నర ఖర్చు చేస్తున్నారు.ఇక భోజన సాదర్ల కోసం ఒక్కో మహిళకు రూ.150ల చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఈ మేరకు రూ.11 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
మళ్లీ పంచాయతీల్లో మేళం ఎందుకో?
ఓ పక్క ప్రాంతీయ సదస్సు విశాఖలోనే జరుగుతున్నప్పటికీ ప్రతి పంచాయతీలో సీఎం ప్రసంగాలను సభలకు రాని వారికి వినిపించేందుకు రూ.7వేల చొప్పున విడుదల చేశారు. ఈ విధంగా విశాఖ జిల్లాలోని 925 పంచాయతీలకు రూ.64.75లక్షలు సెర్ఫ్ నుంచి విడుదలయ్యాయి. వీటితో పంచాయతీల్లో టెంట్లు, కుర్చీలు, ఎల్‌సీడీలు ఏర్పాటు చేసి సీఎం ప్రసంగ పాటవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారికి విన్పించనున్నారు.
పసుపుకుంకుమ సొమ్ముకు కొర్రీ
మా సంఘంలోని 9మంది సభ్యులు గతంలో రుణాలు పొందారు.వారి రుణాలను ప్రభుత్వం మాఫీ చేయలేదు. అసలు,వడ్డీ కలిసి రూ.9లక్షల 67వేలు చెల్లించాలని యూనియన్ బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయి. సంఘంలో తనతో పాటు,గుమ్మా మాణిక్యం,గుజ్జెలి జయంతిలు అప్పట్లో రుణం తీసుకోలేదు. రుణాలు పొందని తమకు కూడా తొలి విడత పసుపు కుంకుమ సొమ్ము చెల్లించకుండా బ్యాంక్ అధికారులు కొర్రి పెట్టారు. రుణాల సొమ్ముకు, పసుపు కుంకుమ సొమ్ముకు సంబంధం లేదని చంద్రబాబు చెబుతుంటే బ్యాంక్ అధికారులు మాత్రం రుణాల సొమ్ము కట్టిన తరువాతే పసుపు కుంకుమ సొమ్ము చెల్లిస్తామన్నారు. రుణం కూడా పొందని తమకు కనీసం రెండో విడత పసుపు కుంకుమ సొమ్ము పంపిణీ చేయాలని కోరుతున్నాం.– అడ్డుమండ, హుకుంపేట మండలం
వడ్డీగా మినహాయించుకున్నారు
మా వీధిలో పది సంఘాలున్నాయి. ప్రతి సంఘం 4.50లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకోళ్లు నోటీసులు ఇచ్చారు.తొలివిడత పసుపు కుంకుమ కింద ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ములతో పాటు పొదుపు ఖాతాలోని సొమ్ములను కూడా అప్పు ఖాతాలకు మళ్లించేశారు. రెండో విడత పసుపుకుంకుమ సొమ్ములు ఇస్తుందన్న నమ్మకం లేదు.–వై.కృష్ణకుమారి,వికాస డ్వాక్రా సంఘం
Comments
Please login to add a commentAdd a comment