యడ్లపాడు : వారంతా విధి వంచితులు. కుష్ఠువ్యాధిగ్రస్తులు. ఏ పనీ చేసుకోలే రని జాలిపడిన ప్రభుత్వం ఆరేళ్ల కిందట సాగుభూమి పట్టాలు పంపిణీ చేసింది. అయితే నేటికీ ఆ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ ఆదేశించినా వారి భూములు అప్పగించిందీ లేదు సాగు చేపట్టిందీ లేదు. మండలంలోని సంగంగోపాలపురం- చెంఘీజ్‌ఖాన్‌పేట గ్రామాల మధ్య కొండపక్కన బున్నీనగర్‌లో 65 కుటుంబాలు. సుమారు 100 మంది జనాభా ఉంటున్నారు. చిన్ని చిన్ని గుడిసెల్లో బతుకుతున్నారు.
వారంతా కుష్ఠువ్యాధిగ్రస్తులు. తమకు నివేశన స్థలాలు కావాలని 2009లో అప్పటి కలెక్టర్‌ను కలసి విన్నవించుకున్నారు. స్పందించిన కలెక్టర్ జయేష్ రంజన్ అదే ఏడాది జూన్ 27న ఒక్కో కుటుంబానికి సెంటుంబాతిక నివేశన స్థలం, అరెకరం సాగుభూమి వంతున ఇస్తూ బీ ఫారాలను పంపిణీ చేశారు. దాంతో వారంతా ఇందిరమ్మ పథకంలో ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. సాగు భూమి మాత్రం చేతికి రాక అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
స్వయంగా కలెక్టర్ ఆదేశించినా ....
అప్పటి కలెక్టర్ జయేష్‌రంజన్ కేవలం నివేశన స్థలాలు ఇవ్వడమే కాకుండా వారికి ఇళ్లకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఆ భూమిని సాగుకు యోగ్యంగా మార్చాల్సిన బాధ్యతను అధికారులకు అప్పగించారు. ఆ తరువాత జరిగిన మార్పుల్లో కలెక్టర్ ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. ఇక వీరిగోడు పట్టించుకున్న అధికారి లేడు. ఇప్పటికీ ఆరుగురు తహశీల్దారులు మారినా వారికి సాగు భూమి చూపించలేదు.
మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు...
గతనెల 19న గోపాలపురంలో ‘నీరు-చెట్టు’ కార్యక్రమం ప్రారంభానికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌ను వారంతా అడ్డుకుని తమ సమస్యను వివరించారు. అధికారులతో మాట్లాడతానంటూ మంత్రి చెప్పి వెళ్లారు. అయినా నేటికీ ఏ అధికారి వారి వద్దకు రాలేదు. ఆ భూములను పెద్దలు ఆక్రమించుకొని ఉండటంతో కుష్ఠు వ్యాధిగ్రస్తులకు న్యాయం చేసేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారని సమాచారం.
పట్టాలిచ్చి ఆరేళ్లు... భూమి ఇవ్వక కన్నీళ్లు !
Published Tue, Mar 10 2015 1:32 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement