మాట్లాడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్
శ్రీకాకుళం అర్బన్: తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. తుపాను ధాటికి ఉద్దానం ప్రాంత ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయని, వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను ఉద్దానంపై తీవ్రంగా ప్రభావం చూపిందన్నారు.
తుపానుతో శ్రీకాకుళం జిల్లా సర్వనాశనమైతే బయట ప్రపంచానికి తెలియకపోవడం దారుణమన్నారు. సీఎం, మంత్రులు, అధికారుల పర్యటనల వల్ల బాధితులకు ఒరిగింది శూన్యమన్నారు. ఎక్కడో కేరళలో తుపాను సంభవిస్తే అక్కడి బాధితులను ఆదుకునేందుకు కోట్ల రూపాయలు సాయం చేశారని, మన రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా శ్రీకాకుళంలో తుపాను సంభవిస్తే ప్రజలను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సాయం కోరతానన్నారు. హుద్‌హుద్ తుపానుకు ఏ విధంగా కేంద్రం సాయం ప్రకటించిందో తిత్లీ తుపానుకు కూడా అదేవిధంగా సాయం ప్రకటించాలని కోరారు.
తుపాను బాధితులకు రూ.25 లక్షలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేన పార్టీలో చేరారు. చదలవాడకు పవన్ కల్యాణ్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ చదలవాడ లాంటివారి చేరికతో పార్టీ మరింత బలపడుతుందన్నారు. ఈ సందర్భంగా తుపాను బాధితులకు రూ.25 లక్షలు సాయం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment