కుట్రలను తిప్పికొడతాం: కోదండరాం | Peace Rally in Hyderabad on August Last Week: Kodandaram | Sakshi
Sakshi News home page

కుట్రలను తిప్పికొడతాం: కోదండరాం

Published Wed, Aug 14 2013 4:05 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

కుట్రలను తిప్పికొడతాం: కోదండరాం

కుట్రలను తిప్పికొడతాం: కోదండరాం

* సీమాంధ్ర ప్రాంత సమ్మె నేపథ్యంలో జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ
* ఈనెల చివరి వారంలో హైదరాబాద్‌లో భారీ శాంతి ర్యాలీ
* 16 నుంచి గ్రామగ్రామాన..17 నుంచి హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు
 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టగల శక్తి తమకు ఉందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలెన్నింటినో తెలంగాణ సమాజం చూసిందన్నారు. కుట్రలతో ఆపగలిగితే ఆగే పరిస్థితిలో తెలంగాణ లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ఎలాంటి కుయుక్తులు తమ ముందు నడవవని హెచ్చరించారు. సంయమనం అవసరమన్న ఉద్దేశంతోనే తాము ఇన్నాళ్లూ ఆగుతూ వచ్చామని తెలిపారు.

రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఏపీఎన్జీవోలు సమ్మెకు దిగిన నేపథ్యంలో తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ మంగళవారం జేఏసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు డి. శ్రవణ్, బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నాయకుడు అశోక్, పలువురు ఉద్యోగ సంఘాల, జేఏసీ నేతలు పాల్గొన్నారు. సమావేశ అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను నిరసిస్తూ ఈనెల చివరి వారంలో హైదరాబాద్‌లో భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు.

సీమాంధ్ర పాలకులు, పెత్తందారులు తమ ఆధిపత్యం కాపాడుకోవడానికి ప్రజల మధ్య తీవ్రమైన రీతిలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం తిరుపతి వెళ్లేవారికి కూడా ఇబ్బంది కలిగించేంత ప్రాంత విద్వేషాలు పెంచడం నాగరిక సమాజంలో సరికాదన్నారు. వారిది ఆధిపత్య ధోరణి అయితే తెలంగాణ ఉద్యమపంథా శాంతి మార్గమని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల ఇరుప్రాంతాల్లో తలెత్తే సమస్యల పరిష్కారం కోసం చర్చ జరగాలన్నది తెలంగాణ ఉద్యమం అభిప్రాయం కూడానని స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర మంత్రివర్గం తక్షణమే తెలంగాణ బిల్లును ఆమోదించి, చర్చల ప్రక్రియను మొదలుపెట్టాలని జేఏసీ డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు.

తెలంగాణను అడ్డుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని నిలువరించేందుకు ఒక భవిష్యత్ కార్యాచరణను జేఏసీ సిద్ధం చేసుకుందని తెలిపారు. 16వ తేదీ నుంచి తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో గ్రామ, గ్రామా న ఎక్కడికక్కడ శాంతి ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు.  16, 17 తేదీలతో ఉద్యోగ సంఘాల నేతలు కూడా అన్ని డివిజన్ కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారని, వాటిని కూడా సమన్వయం చేసి ఆ సందర్భంగా భారీ ర్యాలీలు జరపాలని కోరారు. విద్యార్థులు ఈ ర్యాలీలలో పాల్గొన్ని విజయవంతం చేయాలన్నారు.

17వ తేదీ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నట్టు తెలిపారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్న అందరినీ మరోసారి ఐక్యం చేసి భవిష్యతులో ఏమి చేయాలన్న దానిపై చర్చిస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంత మంత్రుల భార్యలు గవర్నర్‌ను కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరడాన్ని తప్పుపట్టారు. సీమాంధ్ర ప్రాంతంలోని జిల్లాలు వెనుకబడి ఉన్నాయని మంత్రుల భార్యలు చెబుతున్నారని, ఆ ప్రాంతం వెనుకబడడానికి ఈ మంత్రులే కారణం కాబట్టి వారిపై ఏం చర్యలు తీసుకోవాలో వారి భార్యలు చెపితే బాగుంటుందని కోదండరాం సూచించారు.
 
తెలంగాణ సమాజం కిరణ్‌పై విశ్వాసం కోల్పోయింది: ఈటెల
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒకప్రాంత పక్షపాతిగా వ్యవహరిస్తున్నార ని ఈటెల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ సమాజం కిరణ్‌కుమార్‌రెడ్డి పట్ల విశ్వాసం కోల్పోయిందని, తక్షణమే ఆయన పదవి నుంచి తప్పుకోవాలని టీఆర్‌ఎస్ పార్టీ డిమాండ్ చేసోం్తదని చెప్పారు. జేఏసీ కార్యక్రమాలకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. 

సమైక్యాంద్రకు మద్దతుగా ఏపీ ఉద్యోగుల సమ్మె ప్రభావం హైదరాబాద్ నగరంపై నామమాత్రంగా ఉందని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ చెప్పారు. సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈనెల 19న  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలసి తెలంగాణ ప్రక్రియను నిలిపివేసే పక్షంలో తామందరం మెరుపుసమ్మెకు దిగుతామన్న నోటీసు అందజేయనున్నట్టు టి. గెజిటెడ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్ చెప్పారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తమపై వందలాది కేసులు నమోదు చేసిన ప్రభుత్వానికి ఇప్పుడు సీమాంధ్ర జిల్లాల్లో, సచివాలయంలో జరుగుతున్నవి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జరుగుతున్న ఉద్యమంలో సీమాంధ్ర ప్రాంతంలో కొన్ని చోట్ల బీజేపీ కార్యాలయాలపై దాడులు జరగడాన్ని ఆ పార్టీ నేత అశోక్‌కుమార్ ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement