మీరేమైనా రౌడీలా ? | Pendem Dorababu fire on Pithapuram MLA Varma | Sakshi
Sakshi News home page

మీరేమైనా రౌడీలా ?

Published Wed, Apr 29 2015 2:09 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Pendem Dorababu fire on Pithapuram MLA Varma

పిఠాపురం : ఎవరైనా వేలెత్తి చూపితే వేలు తీసేస్తాననడానికి మీరేమైనా బజారు రౌడీలా, అడిగిన వారందరి అంతు చూస్తారా ? అయితే మీ అధికార దుర్వినియోగాన్ని బహిరంగంగా ఎండగడతా అంటూ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సవాల్ విసిరారు. కొత్తపల్లిలో హోటల్ మేనేజ్‌మెంటు కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తాము అధికారంలో ఉన్నామని ఏదైనా చేస్తామని, ఎవరైనా తెలుగుదేశం కార్యకర్తల వైపు వేలెత్తి చూపితే అవి తీసేస్తానని వ్యాఖ్యానించడంపై పెండెం మంగళవారం ఘాటుగా స్పందించారు.
 
  పాలక పక్షం చేసే అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించడం దానిని వేలెత్తి చూపే హక్కు ప్రతిపక్షానికి ఉందని, ఆ హక్కును కాలరాయాలని చూస్తే ఎంతటి వారైనా కాలగర్భంలో కలిసిపోతారని చరిత్ర చెబుతోందన్నారు. టికెట్టు ఇవ్వకపోతే ఇప్పుడు దేవుడంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునే పచ్చిదగా కోరని, మోసగాడని, నమ్మిన వారిని నట్టేట ముంచుతాడని బహిరంగంగా విమర్శించి ఆ పార్టీ జెండాలు నడిరోడ్డుపై తగలబెట్టించిన వర్మ ఈ రోజు గతం మర్చిపోయి మాట్లాడడం ప్రజలు చూస్తున్నారని వారు తగిన బుద్ది చెప్పే రోజు దగ్గర పడిందన్నారు. ఏ పార్టీ పేరుతో ఇప్పుడు పబ్బం గడుపుకుంటున్నావో అదే పార్టీకి ప్రాణాలు దారబోసిన నేతలను కార్యకర్తలను ఎందుకు పక్కన పెడుతున్నావో సమాధానం చెప్పుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉందన్నారు.
 
  గతంలో ప్రతి పక్ష నేతగా గత ఎమ్మెల్యే చేసిన ప్రతి పనిని వర్మ వేలెత్తి చూపాడని, అన్ని పనులకు అడ్డు తగిలాడని ఆ ఎమ్మెల్యేలు మీలాగే వేలు తీసేసుంటే ఈ రోజు వర్మకు అసలు వేళ్లే ఉండేవి కాదని ఆయన అన్నారు. ఒక వేలుతో ఎదుటి వారిని చూపిస్తే నాలుగేళ్లు నీవైపు చూపిస్తాయన్న నిజాన్ని మరిచి అధికార దాహంతో మాట్లాడడం మానుకోకపోతే తీవ్రస్థాయిలో ప్రజా ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. గతంలో హోటల్ మేనేజ్‌మెంటు కాలేజీకి ఒక చోట శంకుస్థాపన చేశారని, కొత్తపల్లి హైస్కూలులో మినీ స్టేడియం నిర్మాణానికి  నిధులు విడుదల అవ్వడం మట్టి నమూనాలు తీయడం పనులు ప్రారంభం కావడం జరిగిన విషయాన్ని చెప్పడం ప్రతిపక్షం చేసిన తప్పుగా భావించడం ఎంతవరకు సమంజసమో వర్మ సమాధానం చెప్పాలన్నారు. కొత్తపల్లి మండలంలో ఎమ్మెల్యే వర్మ తన అనుచర గణంతో చేస్తున్న అక్రమ ఇసుక తవ్వకాలపై కార్యకర్తలు నాయకులతో వచ్చి అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement