ఖమ్మం మయూరి సెంటర్, న్యూస్‌లైన్: జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్‌లో పదివేలకోట్ల రూపాయలు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గం, డివిజన్ కార్యదర్శుల సమావేశం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసాని అయిలయ్య అధ్యక్షతన గురువారం ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో పోతినేని మాట్లాడుతూ.. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయాలన్న డిమాండుతో సీపీఎం వివిధ రూపాల్లో అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. వీటి ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి, బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఆ తరువాత దీనిని విస్మరించిందని విమర్శించారు.
ఈ చివరి బడ్జెట్‌లోనైనా నిధులు మంజూరు చేసి జిల్లా ప్రజలను, రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, తుపానుతో జిల్లాలో రెండులక్షల హెక్టార్లలో పత్తి, లక్ష ఎకరాల్లో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. జిల్లాలో పంట నష్టం విలువ 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఉందని అన్నారు. అధికారులు మాత్రం తూతూ మంత్రంగా సర్వే చేసి, కేవలం రూ.60లక్షల విలువైన పంట మాత్రమే నష్టపోయినట్టుగా చెప్పారని విమర్శించారు. పంట నష్టంపై వెంటనే రీసర్వే చేయించి, బాధిత రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సున్నం రాజయ్య, బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వరరావు, ఎజె.రమేష్, యర్రా శ్రీకాంత్, పొన్నం వెంకటేశ్వరరావు, అన్నవరపు కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలి
Published Fri, Jan 17 2014 5:12 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement