పింఛన్లకు ‘సర్వే' కత్తెర | Pensions 'survey' scissors | Sakshi
Sakshi News home page

పింఛన్లకు ‘సర్వే' కత్తెర

Published Sat, Sep 20 2014 12:01 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM

పింఛన్లకు ‘సర్వే' కత్తెర - Sakshi

పింఛన్లకు ‘సర్వే' కత్తెర

కర్నూలు(అగ్రికల్చర్): ఎన్నికలకు ముందు అధికారం కోసం హామీలిచ్చిన చంద్రబాబు, అధికారం చేపట్టిన తర్వాత హామీల అమలుకు ఎలా గండికొట్టాలో చూస్తున్నారు.

జిల్లాలోని పింఛన్లు..
 వృద్ధాప్య         151103
 వితంతువులు        113459
 వికలాంగులు         38343
 చేనేత  కార్మికులు     4067
 కల్లుగీత కార్మికులు     124
 అభయహస్తం         18,869
 మొత్తం            3,25,965
 
 కర్నూలు(అగ్రికల్చర్): ఎన్నికలకు ముందు అధికారం కోసం హామీలిచ్చిన చంద్రబాబు, అధికారం చేపట్టిన తర్వాత హామీల అమలుకు ఎలా గండికొట్టాలో చూస్తున్నారు. ఆల్‌ఫ్రీ బాబు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల రుణమాఫీకి నిబంధనల పేరుతో అవరోధాలు సృష్టించారు. డ్వాక్రా రుణాల మాఫీ లేదని తేల్చేశారు. ఇప్పుడు సామాజిక భద్రతా పింఛన్లకు కోత పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల్లో పింఛన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రావడంతో లబ్ధిదారులు సంతోషించారు. అయితే సర్వే పేరుతో లబ్ధిదారులను తగ్గించడానికి మార్గదర్శకాలు విడుదల చేయడంతో వారిలో ఆందోళన నెలకొంది. సామాజిక భద్రతా పింఛన్ల మొత్తాన్ని అక్టోబర్ 2 నుంచి పెంచుతున్న ప్రభుత్వం అంతకుముందు వాటిలో భారీగా కోత వేయడానికి సిద్ధమైంది. అనర్హత పేరుతో పింఛన్లను తొలగించడం ద్వారా ఆదా అయ్యే మొత్తంతో పెంపు ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతోంది. పింఛన్‌దారులకు అర్హత ఉందా లేదా అని నిర్ణయించే అధికారం రాజకీయ పదవుల్లో ఉన్నవారికి అప్పగించడం వల్ల తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులకే పింఛన్లు దక్కే అవకాశం ఉంది. గ్రామ, వార్డు స్థాయి కమిటీల్లో తెలుగుదేశం కార్యకర్తలకే పెద్దపీట వేస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం ఎంపిక చేయకుండా పార్టీకి అనుకూలంగా వ్యవహరించే వారిని సభ్యులుగా నియమించడాన్ని అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. పింఛన్లకు ఆధార్, రేషన్ కార్డులను అనుసంధానం చేస్తుండటం వల్ల చాలా మంది పింఛన్లు కోల్పోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు నిబంధనలను కఠినతరం చేయడం వల్ల అనేక మంది పింఛన్‌దారులపై అనర్హత వేటు పడే అవకాశముంది.
 మార్గదర్శకాలు.. పింఛన్లను విధిగా ఆధార్, రేషన్ కార్డులతో అనుసంధానం చేస్తారు. 2.5  ఎకరాలలోపు ఆయకట్టు లేదా  5 ఎకరాలు మెట్ట లేదా రెండూ కలిపి 5 ఎకరాలలోపు భూమి కల్గినవారే అర్హులు. ఏడాదికి ప్రభుత్వపరంగా కానీ లేదా ప్రైవేటుపరంగా కాని రూ.60 వేల పైబడి ఆదాయం వచ్చేవారికి అర్హత ఉండదు. ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కూడా అర్హతను కోల్పోతారు. వితంతు పింఛన్ తీసుకునే మహిళలు విధిగా భర్త మరణించినట్లు ధ్రువీకరణ పత్రం చూపాలి. చేనేత కార్మికులు కూడా తగిన గుర్తింపు పత్రాలు చూపాల్సి ఉంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికే పింఛన్లు వరిస్తాయి.
 భారీగా పింఛన్లు కోల్పోయే ప్రమాదం.. ప్రభుత్వం చేపట్టిన విచారణ వల్ల భారీ ఎత్తున పింఛన్లు రద్దు అయ్యే అవకాశం ఉంది. అయిదేళ్ల క్రితమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లపై సర్వే చేసి బోగస్ పింఛన్లను తొలగించింది. ఇందువల్ల బోగస్ పింఛన్‌కు తావు లేదు. కానీ పింఛన్లలో భారీ కోత పెట్టి తెలుగుదేశం కార్యకర్తలు, మద్దతుదారులు, సానుభూతిపరులకు పెద్దపీట వేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ  పదవుల్లో ఉన్నవారితో సర్వే చేపట్టడం చర్చనీయాంశం అయింది. గ్రామస్థాయిలో సర్పంచు, అర్బన్ ప్రాంతాల్లో వార్డు సభ్యుల ఆధ్వర్యంలోని కమిటీల ముందు పింఛన్‌దారులందరూ హాజరు కావాల్సిందే. వెరిఫికేషన్‌కు రాకపోతే బోగస్‌గా భావించి తొలగిస్తారు. వెరిఫికేషన్ కమిటీ ముందుకు రాలేని వారిని కనీసం పంచాయతీ సెక్రటరీ, ఇద్దరు ఎస్‌హెచ్‌జీ మహిళలు గుర్తించాల్సి ఉంది. మొత్తం మీద వెరిఫికేషన్ పింఛన్‌దారులలో గుబులు రేపుతోంది.
 హడావుడిగా పరిశీలన.. సామాజిక భద్రతా పింఛన్లను తగ్గించాలని నిర్ణయించిన ప్రభుత్వం హడావుడిగా పరిశీలన కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇది కూడా ఈ నెల 21వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇంతవరకు కమిటీలు కూడా ఏర్పడలేదు. వెరిఫికేషన్ ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలో 3.27 లక్షలకుపైగా పింఛన్లు ఉన్నాయి. ఇన్ని పింఛన్లను ఇంత తక్కువ సమయంలో వెరిఫికేషన్ చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. సర్పంచు/వార్డు సభ్యుడు సూచించిన వారికే పింఛన్లు ఉంటాయి. పింఛన్లపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల లబ్ధిదారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పింఛన్ల మొత్తాన్ని పెంచినట్లే పెంచి లబ్ధిదారుల్లో భారీగా కోత కోయడానికి సిద్ధం కావడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement