అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : సమైక్య ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఎత్తిన పిడికిలి దించకుండా.. మడమ తిప్పకుండా జిల్లా ప్రజలు, ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పెద్దఎత్తున కొనసాగాయి. జిల్లా సంయుక్త జేఏసీ సోమవారం నుంచి చేపట్టిన 48 గంటల నిరవధిక బంద్ విజయవంతమైంది. ఎక్కడిక్కడ రహదారులను దిగ్బంధించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, బ్యాంకులు, పెట్రోలు బంకులు, సినిమాహాళ్లు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
‘అనంత’లో మంత్రి శైలజానాథ్‌కు, కళ్యాణదుర్గంలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు సమైక్యవాదుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర విభజన నిర్ణయంతో మనస్తాపం చెంది ధర్మవరానికి చెందిన ఇంటర్ విద్యార్థి మహేష్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్, రాష్ట్ర మంత్రి శైలజానాథ్ 27 రోజుల ఉద్యమం తరువాత తొలిసారిగా అనంతపురంలో సమైక్య ర్యాలీ, సభ నిర్వహించారు.
డీసీసీ కార్యాలయం ఎదుట ఏర్పాటుచేసిన ఈ సభకు శింగనమల నియోజకవర్గం నుంచి జనాన్ని తీసుకొచ్చారు. అంతకుమునుపు పోలీసు పహారాలో సమైక్య ర్యాలీ చేశారు. అయితే.. మంత్రికి అడుగడుగునా నిరసన సెగలు తగిలాయి. ప్రభుత్వాసుపత్రి ఎదుట మెడికల్ జేఏసీ, తెలుగుతల్లి విగ్రహం ఎదుట ఆర్‌అండ్ బీ, ఇరిగేషన్ జేఏసీ, జెడ్పీ ఎదుట పీఆర్ ఉద్యోగ సంఘాల జేఏసీ, ఆ తరువాత మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ నేతలు ‘గో బ్యాక్’ అంటూ నినదించారు. పగటి వేషగాళ్ల మాయమాటలను ఇంకా నమ్మే పరిస్థితి లేదంటూ పీఆర్ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు నోటికి, చెవులకు నల్లరిబ్బను కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కాగా... నగరంలో జాక్టో, న్యాయవాదుల జేఏసీ, బీసీ, ఎస్టీ,ఎస్టీ, మైనార్టీ సంఘాల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ, అనుబంధ శాఖల ఉద్యోగులు ఓవర్‌బ్రిడ్జి వద్ద కాసేపు బైఠాయించారు.
అధ్యాపక జేఏసీ నేతలు జాగింగ్ చేస్తూ నిరసన తెలిపారు. సంయుక్త జేఏసీ పిలుపు మేరకు నగరంలో రహదారులన్నీ దిగ్బంధించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా రహదారుల దిగ్బంధం చేపట్టారు. కళ్యాణదుర్గంలో జేఏసీ నేతల రిలేదీక్షలకు సంఘీభావం తెలపడానికి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వెళ్లగా.. ‘గో బ్యాక్’ అంటూ నినదించారు. టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ ఇవ్వడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందని మండిపడ్డారు. తాడిపత్రిలో రాజకీయ జేఏసీ, ఉద్యోగ, కార్మిక, కులసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల ఆధ్వర్యంలో ‘జనఘోష’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. వాకింగ్ సభ్యులు రోడ్డుపైనే యోగాసనాలతో విన్యాసాలు చేశారు. ధర్మవరంలో జేఏసీ నేతల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గుంతకల్లులో సమైక్యవాదులు గొడుగులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. గుత్తిలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. పామిడిలో వైఎస్సార్‌సీపీ నేతలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. కదిరిలో అధ్యాపకులు రిలేదీక్షలు ప్రారంభించారు. విద్యుత్ ఉద్యోగులు మానవహారం నిర్మించారు. చెప్పుల షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో 205 జాతీయ రహదారిలో వంటా వార్పు చేపట్టారు. హిందూపురంలో ర్యాలీలు, నిరసనలు హోరెత్తాయి. మడకశిరలో ఉద్యోగ సంఘాల జేఏసీ దీక్షలు కొనసాగుతున్నాయి. 48 గంటల నిరవధిక బంద్ విజయవంతమైంది. రొళ్లలో యాదవసంఘం నేతలు ర్యాలీ చేశారు. అమరాపురంలో ఉపాధ్యాయులు మొహాలకు నల్లగుడ్డ కట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. ఓడీ చెరువులో సమైక్యవాదులు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు.
అమడగూరులో పొదుపు సంఘాల మహిళలు, గోరంట్లలో నాయీ బాహ్మణులు ర్యాలీ నిర్వహించారు. పెనుకొండలో సమైక్యవాదులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాయదుర్గంలో ఆర్టీసీ ఎన్‌ఎంయూ నాయకుడు ఎం.నాగరాజు ఆమరణ దీక్షకు దిగారు. ఆమరణ దీక్ష చేస్తున్న వారికి కాపు భారతి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరులో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. గార్లదిన్నెలో వాల్మీకులు, కల్లూరులో నాయీ బ్రాహ్మణులు, తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం, బీసీ సంక్షేమ సంఘం, ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు.
మిన్నంటిన ఉద్యమ సెగ
Published Wed, Aug 28 2013 5:20 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement