భీమవరం మండలంలోని తుందుర్రు గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు
వీరవాసరం/నరసాపురం రూరల్: తుందుర్రు పరిసర గ్రామాలు ఉద్రిక్తంగా మారాయి. నరసాపురం మండలం కె.బేతపూడి, తుందుర్రు గ్రామాల మధ్యలో జరుగుతున్న ఆక్వాఫుడ్‌పార్క్ పైప్‌లైన్ పనులు ఆపాలంటూ గురువారం ఉదయం సెల్‌టవర్లు ఎక్కిన ఆందోళనకారులు రాత్రిపొద్దుపోయే వరకూ దిగిరాలేదు. అధికారులు వచ్చి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో గ్రామాల్లో ఆందోళన నెలకొంది.
అసలేం జరిగిందంటే..
తుందుర్రు గ్రామంలో ఆక్వా ఫుడ్ పార్క్ పైప్‌లైన్ పనుల నిమిత్తం పోలీసులు గురువారం భారీగా మోహరించారు. పనులు ప్రారంభించారు. దీనిని నిరసిస్తూ.. తుందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి సత్యవతి గురువారం ఉదయం వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో సెల్ టవర్‌పైకి ఎక్కి నిరసన ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకుని కొప్పర్రు గ్రామంలోనూ జొన్నల గరువుకు చెందిన కొయ్యే సంపతరావు, పెదపౌల్ సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగారు. దీంతో ఈ గ్రామాలతోపాటు తుందుర్రు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా ప్రాంతాలకు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉదయం 7 గంటలసమయంలో సెల్ టవర్ ఎక్కిన ఆరేటి సత్యవతి, సంపతరావు, పెదపౌలు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నా.. లెక్కచేయలేదు.
రాత్రి కావస్తున్నా సెల్‌టవర్ నుంచి దిగిరాలేదు. పైప్‌లైన్ పనులు నిలుపుదల చేస్తామని హామీ ఇస్తేనే సెల్ టవర్ నుంచి దిగివస్తామని, లేదంటే సెల్‌టవర్‌పైనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని తేల్చిచెప్పారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న వీరవాసరం తహసీల్దార్ ఎం.ముక్కంటి ఆందోళనకారులతోనూ, మత్స్యపురి, తుందుర్రు గ్రామస్తులతోనూ చర్చించారు. సబ్‌కలెక్టర్‌గానీ, డీఎస్పీగానీ వచ్చి హామి ఇవ్వాలని తహసీల్దార్ ముక్కంటికి స్థానికులు తెలియజేశారు. విషయాన్ని పైస్థాయి అధికారులకు తెలియజేస్తానని తహసీల్దార్ తెలిపారు. ఇదే సందర్భంలో రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఏమీ చేయలేక పోతున్నారని ఒక మహిళ టవర్ ఎక్కి కొన్ని గంటలపాటు దీక్షకు కూర్చుంటే స్పందించడం లేదంటూ ఆయాశాఖాధికారులను మత్స్యపురి, తుందుర్రు గ్రామస్తులు నిలదీశారు. రాస్తారోకో చేశారు.
పోలీసుల పహారా
ఇదిలా ఉంటే తుందుర్రు పరిసర గ్రామాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఆందోళనకారులకు మద్దతు తెలిపేందుకు బయట నుంచి ఎవరూ రాకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో నుంచి ప్రజలనూ బయటకు వెళ్లనీయడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే తుందుర్రు, జొన్నలగరువు గ్రామాలలో సుమారు 200 మందికి పైగా పోలీసులు మోహరించి పైపులైన్ పనులు దగ్గరుండి చేయిస్తున్నారు. దీనిపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment