గోదావరి ఉగ్రరూపం కారణంగా కోనసీమ లంక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో వరద బాధిత కుటుంబాలకు రూ. 2వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. లంక గ్రామాల ప్రజలకు తాగునీరు, రేషన్, పశుగ్రాసాన్ని అధికారులు అందిస్తున్నారు. ఇక, అల్లూరి సీతారామారాజు జిల్లాలో పెద్ద ఎత్తున సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద గోదావరి వదర ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ అధికారులు హెచ్చరించారు. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఇక, సహాయక చర్యల్లో 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో 385 గ్రామాలు వరద ప్రభావితమయ్యాయి. ఇప్పటివరకు 97,205 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 256 మెడికల్ క్యాంప్స్ నిర్వహించి.. 1,25,015 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.
మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది. ప్రాజెక్ట్స్ స్పీల్వే వద్ద 36.1 మీటర్లకు వరద నీరు చేరుకుంది. 48 గేట్ల ద్వారా దిగువకు 19.58లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్తోంది. కాగా, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పొన్నపల్లి వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఏటిగట్టు ఫుట్‌పాత్ రెయిలింగ్ కోతకు గురైంది. ఈ క్రమంలో ఫుట్‌పాత్ రెయిలింగ్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక, వశిష్ట గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గింది. కానీ, ఇంకా ముంపులోనే 33 లంక గ్రామాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment