
ఆర్కేబీచ్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న బాధిత గ్రామాల ప్రజలు
సాక్షి, విశాఖపట్నం: అర్ధరాత్రి వేళ.. నగరంలో అలజడి... ఎల్జీ పాలిమర్స్‌లో మళ్లీ గ్యాస్ లీకయిందంటూ వచ్చిన వదంతులు.. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. పిల్లా పాపలతో పరుగులు పెట్టించింది. దీనితో జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. ఒకవైపు అధికారులు, పోలీసులు వందతులను నమ్మొద్దని, ఇళ్లలోనే ఉండాలని మైకులలో ప్రచారాలు చేసినా నగరవాసులు పట్టించుకోలేదు. ఏ క్షణమైనా కంపెనీలో గ్యాస్ ట్యాంకర్ పేలిపోతుందని, దాని ప్రభావం 7 కిలోమీటర్ల వరకు ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో చెలరేగిన పుకార్లు నగర ప్రజల్ని కలవరానికి గురిచేశాయి. గోపాలపట్నం పరిసర ప్రాంతవాసులే కాకుండా ఒకవైపు పెందుర్తి వరకు, మరోవైపు కంచరపాలెం వరకు, ఇంకోవైపు సింహాచలం వరకు ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి దూరప్రాంతాలకు పరుగులు పెట్టారు. పెట్రోల్ బంకుల్లో వాహనాలు బారులు తీరాయి. కొంత మంది తెలిసిన వాళ్ల ఇళ్లకు వెళితే.. మరికొంత మంది దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తలదాచుకున్నారు. ఎక్కువ మంది బీచ్‌కు వెళ్లారు.
ఉలిక్కిపడ్డ పోలీస్ యంత్రాంగం...
కరోనా నియంత్రణలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ఉన్న పోలీసులు పెద్ద సంఖ్యలో వస్తున్న జనాలను చూసి ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకొని.. వదంతులను నమ్మొదని పెట్రోలింగ్ వాహనాలలో మైక్‌ల ద్వారా ప్రచారం చేశారు. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. దీంతో పోలీసులు మీడియా కార్యాలయాలకు సైతం పత్రికా ప్రకటనలు జారీ చేశారు. అలాగే ఈ వందంతుల వ్యాప్తిపై నిఘా పెట్టారు. ఇది ఆకతాయిల పనా? లేక విశాఖ సేఫ్ కాదన్న విషయాన్ని చెప్పడానికి చేసిన కుట్రా.. అని పోలీసులు రహస్య విచారణ చేస్తున్నారు. నగరంలో ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో నగర ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. శుక్రవారం సాయంత్రానికి తిరిగి ఇళ్లకు వెళ్లారు.
భయంతో వెళ్లిపోయాం...
రాత్రి 12.30కు స్నేహితుల నుంచి ఫోన్ వచ్చింది. ఎల్జీ పాలిమర్స్‌లో ట్యాంక్ పేలి 7 కిలోమీటర్ల వరకు గ్యాస్ లీకవుతుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుందని చెప్పారు. ముందు నమ్మలేదు. చుట్టు పక్కల వారు బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నామని చెప్పారు. భయంతో మేము కూడా మా బంధువుల ఇంటికి బయల్దేరారు. – జి.ముత్యాలమ్మ,వేపగుంట
Comments
Please login to add a commentAdd a comment