
ప్రజల కోసమే బతుకుతున్నట్లు బిల్డప్పులిచ్చి...
హైదరాబాద్: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రూ.కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రమాణస్వీకారానికి హంగు-ఆర్భాటాలు అవసరమా అని నిలదీశారు. ప్రజల కోసమే బతుకుతున్నట్లు బిల్డప్‌లు ఇచ్చే చంద్రబాబు మాటలన్నీ వట్టి మాటలేనని తేలిపోయిందన్నారు.
ప్రజా ప్రయోజనాల కంటే పబ్లిసిటీ ముఖ్యమన్నట్లు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు, విల్లాల పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రజలను చందాలు ఇవ్వాలని కోరిన చంద్రబాబు ఆ డబ్బునే మంచినీళ్లలా ఖర్చుపెట్టడం సమంజసమా అని శ్రీకాంత్‌రెడ్డి అడిగారు.