హైదరాబాద్ : తెలంగాణకు అనుకూలమని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పార్లమెంట్లో అనుసరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. ఆయన శుక్రవారం ఉదయం ఓ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో కాంగ్రెస్కు తెలుసునని తెలిపారు. ప్రాంతాల వారిగా నాయకులు విడిపోయారని వారు తమ ప్రాంత ప్రజల ఆకాంక్షలు తెలుపుతున్నారని మల్లు రవి అన్నారు. తెలుగుదేశం పార్టీ తన వైఖరి ఏంటో తెలియ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా భారతీయ జనతా పార్టీ 2014 లోక్‌సభ ఎన్నికల కోసం తెలుగుదేశంతో చేతులు కలిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ఇచ్చే అంశాన్ని తుంగలో తొక్కుతోందా? లోక్‌సభ కార్యక్రమాలకు అడ్డుతగులుతున్న సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌ను నిలిపివేయటంలో బిజెపి నిర్వహించిన పాత్రను పరిశీలిస్తే ఈ అనుమానం కలుగుతోంది.
గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం సభలో గొడవ చేసిన తెలంగాణ ఎంపీల సస్పెన్షన్‌ను బిజెపి సమర్థించటం తెలిసిందే. అయితే నిన్న మాత్రం సమైక్యాంధ్ర కోసం గొడవ చేస్తున్న టిడిపి, కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌ను గట్టిగా వ్యతిరేకించటం ద్వారా బిజెపి కొత్త రాజకీయానికి తెరలేపింది.