సాక్షి, భీమవరం : జిల్లాలోని క్లబ్‌ల్లో పేకాటలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పేకాట పాపారావులు ఇప్పుడు యానాంకు క్యూ కడుతున్నారు. కాలక్షేపం కోసం ఏర్పాటు చేసుకున్న రిక్రియేషన్ క్లబ్‌ల్లో నిబంధనలకు విరుద్ధంగా పేకాట ఆడడంతో.. గత రెండు నెలలుగా జిల్లాలోని క్లబ్‌లపై పోలీసుల దాడులు ముమ్మరమయ్యాయి. కొన్ని చోట్ల యూత్, కాస్మో క్లబ్‌లు, టౌన్‌హాళ్లలో విచ్చలవిడిగా మూడుముక్కలాట ఆడడంతో పోలీసులు వారి ఆట కట్టిస్తున్నారు.
దీంతో పేకాట లేనిదే పొద్దుగడవని కొంతమంది పేకాట ఆడేందుకు పొరుగున ఉన్న కేంద్రపాలితప్రాంతం యానాంకు తరలిపోతున్నారు. గతంలో మన రాష్ట్రంలో మద్య నిషేధం అమల్లో ఉన్న సమయంలో ఉభయగోదావరి, కృష్టా తదితర జిల్లాల మందుబాబులు మద్యం కోసం యానాం వెళ్లేవారు. ఇప్పుడు పేకాట ఆడేందుకు ఖరీదైన కారల్లో యానాం తరలివెళ్తున్నారు.
జిల్లాలో సుమారు 40 క్లబ్‌లు
భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం వంటి పట్టణాలతోపాటు ఏలూరులో యూత్‌క్లబ్, కాస్మోపాలిటన్ క్లబ్, టౌన్ హాల్స్‌ను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇవిగాకుండా చింతలపూడి, చేబ్రోలు, నారాయణపురం, చాగల్లు, నల్లజర్ల వంటి గ్రామాల్లో కూడా క్లబ్‌లు నిర్వహిస్తున్నారు. క్లబ్‌ల్లో కొన్ని చోట్ల విచ్చలవిడిగా పేకాట, మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని క్లబ్‌ల్లో అధికారికంగా మద్యం విక్రయాలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల అనధికారికంగా మద్యం షాపులు నడుపుతున్నారు.
సాధారణంగా క్లబ్‌లు, టౌన్‌హాల్స్‌లో కేవలం సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. దానిలో సభ్యులైన వారే ఆటలు ఆడుకునేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని క్లబ్‌ల్లో 13 ముక్కలతో సీక్వెన్స్ ఆడుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే పెద్ద మొత్తంలో డబ్బులతో పేకాట ఆడడమే కాకుండా.. కొన్నిచోట్ల వార్షికోత్సవ వేడుకల పేరిట ఆశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. మందు పార్టీలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. దీంతో జిల్లావ్యాప్తంగా పోలీసులు క్లబ్‌లపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తుండడంతో పేకాటరాయుళ్లు పెద్ద సంఖ్యలో యానాం పరుగులు తీస్తున్నారు.
రూ.లక్షల్లో సభ్యత్వం
పట్టణాల్లో ఏర్పాటుచేసే క్లబ్‌లు, టౌన్‌హాల్స్‌లో సభ్యత్వం తీసుకోవాలంటే ఆయా కమిటీలకు లక్షల్లో సొమ్ములు చెల్లించాల్సిందే. భీమవరంలో ఒక క్లబ్‌లో లైఫ్ సభ్యత్వం కోసం రూ. 2 లక్షలు చెల్లించాలి. డోనరైతే రూ.4 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
రెండు నెలలుగా వెలవెల
పేకాట రాయుళ్లు జిల్లా వదిలి యానాం వెళ్తుండడంతో జిల్లాలోని క్లబ్‌లు, టౌన్‌హాల్స్ గత రెండు నెలలుగా వెలవెలబోతున్నాయి. ప్రధానంగా ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం వంటి క్లబ్‌ల్లో కోర్టు అనుమతించిన 13 పేక ముక్కలతోనే ఆడుతుంటారు. అయితే కొంతమంది పెద్ద మొత్తంలో డబ్బుతో విచ్చలవిడిగా పేకాట నిర్వహించడంతో జిల్లాలో క్లబ్‌ల్లో ఎలాంటి పేకాట జరగకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. దీనితో క్లబ్‌లు వెలవెలబోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment