అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లు జనంతో కళకళలాడుతున్నాయి. ఇళ్లకోసం దరఖాస్తు చేసినవారంతా వారిని ప్రసన్నం చేసుకునేందుకు క్యూకడుతున్నారు. అన్నివిధాలా అనుకూలురైన జాబితా తయారీలో నేతలంతా తలమునకలై ఉన్నారు. ఇప్పటివరకూ కాలరెగరేసిన జన్మభూమి కమిటీలసూచనలను పక్కన పెట్టిన అధికారులు అసలైన జాబితాలకోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. అర్హతల మాటెలా ఉన్నా... తమవారికి అందలం ఎక్కించేందుకు నాయకులంతా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పుడు నేతల ఆశీస్సులు అవసరమవుతున్నాయి. వారి సిఫార్సులుంటేనే ఇళ్లు మంజూరు కానున్నాయి. అధికారులు సైతం వారి ప్రతిపాదనల కోసం ఎదురు చూస్తున్నారు. జన్మభూమి కమిటీల ముసుగులో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రస్తుతం వారి ఇళ్ల వద్ద ప్రతిపాదిత జాబితాలు తయారవుతున్నాయి. అంతా కొలిక్కి వచ్చాక గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికపై జాప్యం జరుగుతోంది.
ప్రకటనే తప్ప మార్గదర్శకాలు లేవు
టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లయినా మంజూరు కాలేదు. ఎట్టకేలకు గ్రామీణ జిల్లాకు 10,500, పట్టణాల్లో 11,303ఇళ్లు మంజూరు చేస్తూ ప్రకటన జారీ చేసినా లబ్ధిదారుల ఎంపిక విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. పట్టణాల్లో ఇచ్చే ఇళ్లను కేంద్రసాయంతో ఇవ్వనుంది. గ్రామీణ ఇళ్ల యూనిట్ ఖరీదు రూ. 2.75లక్షలు. ఇందులో రూ. లక్షా 25వేలు ప్రభుత్వ సబ్సిడీగా, మిగతా రూ. లక్షా 50వేలు రుణంగా ఇవ్వనుంది. ఇప్పుడా రుణం ప్రభుత్వం ఇస్తుందా? బ్యాంకుల నుంచి తీసుకోమంటుందా? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. గ్రామీణ జిల్లాకు మంజూరైన 10,500ఇళ్లల్లో విజయనగరం నియోజకవర్గానికి 500, మిగతా నియోజకవర్గాలకు చెరో 1250చొప్పున ఇప్పటికే కేటాయించారు. ఇక, గ్రామీణ ప్రాంతాలకు కేటాయించిన వాటిలో 50శాతం లేఅవుట్‌గా, 50శాతం వ్యక్తిగతంగా మంజూరు చేయనున్నారు. పట్టణ ప్రాంత ఇళ్లకు సంబంధించి నేటికీ స్పష్టత రాలేదు. 11,303 కేటాయించినట్టు ప్రకటన తప్ప వాటికి సంబంధించిన మార్గదర్శకాల్లేవు. ఇంతవరకు యూనిట్ ఖరీదూ నిర్ధారణ కాలేదు. రూ.4.98లక్షలని, రూ. 6లక్షలు అని వార్తలు రావడం తప్ప వాస్తవమేంటో తెలియలేదు.
లబ్ధిదారుల ఎంపికపై మల్లగుల్లాలు
మూడో విడత జన్మభూమిలో వచ్చిన ధరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. జన్మభూమి గ్రామసభల్లో జిల్లా వ్యాప్తంగా ఇళ్ల కోసం సుమారు 32వేల దరఖాస్తులొచ్చాయి. వాటిలో అర్హులైన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకూ జిల్లా అధికారులకు జన్మభూమి కమిటీ పేరుతో 1440 ప్రతిపాదిత దరఖాస్తులొచ్చాయి. కానీ తమ సిఫార్సులు లేకుండా ఎటువంటి ఎంపిక చేపట్టొద్దని హౌసింగ్ అధికారులకు టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ మౌఖిక ఆదేశాలివ్వడంతో వాటిని పక్కపెట్టారు.
జాబితా తయారీలో టీడీపీ నేతలు
ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక పనిలో బిజీగాఉన్నారు. అర్హతలకంటే తమ అనుచరులా? కాదా? అన్నదే ప్రామాణికంగా జాబితాలు తయారు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేనిచోట ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు జాబితాలు రూపొందిస్తున్నారు. ఇప్పుడా పార్టీ నేతల్లో ఇళ్లల్లో సందడి నెలకొంది. ఇళ్లు తక్కువగా రావడంతో ఎవరికివ్వాలన్నదానిపైనా మల్లగుల్లాలు పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో సంతృప్తికర పద్ధతిలో ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పుడు అరకొరగా కేటాయించడం.. దరఖాస్తులు లెక్కకుమిక్కిలిగా రావడంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు.
ఇంకా జాబితాలు రాలేదు
జిల్లాలో జన్మభూమి సభల్లో సుమారు 32వేల దరఖాస్తులొచ్చాయి. ఇప్పటి వరకు జన్మభూమి కమిటీల నుంచి 1440 ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని పరిశీలన నిమిత్తం ఉంచాం. మిగతా ప్రతిపాదనలన్నీ వచ్చాక లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతాం. ఇళ్లు రుణం విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
- ఎస్.వి.రమణమూర్తి, హౌసింగ్ ప్రాజెక్టు డెరైక్టర్, విజయనగరం.
సిఫార్సులుంటే... గృహయోగం
Published Thu, Jan 21 2016 3:21 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM
Advertisement