
టార్పాలిన్లతో తాత్కాలికంగా పాక వేసుకుంటున్న బాధితులు , తడిసిముద్దయిన ధాన్యాన్ని శుభ్రం చేస్తున్న మహిళ
తిత్లీ తుపాను గిరిజన గూడలను ధ్వంసం చేసింది. జీవనాధారమైన చెట్లను కూల్చేసింది. నిరాశ్రయులుగా మిగిల్చింది. తిండి గింజలు తడిసి ముద్దయ్యాయి. తాగేందుకు నీరు దొరకడం లేదు. కట్టుకునేందుకు బట్టలేదు. తలదాచుకునేందుకు గూడు లేదు. కొండదిగుదామంటే దారిపొడవునా నేలకొరిగిన చెట్లే. 18 రోజులుగా వారు పడుతున్న వేదన వర్ణణాతీతం. వారి బతుకులు హృదయవిదారకరం. కురుపాం మండలంలోని జరడ పంచాయతీకి వెళ్లిన ‘సాక్షి’ బృందానికి గిరిజనులు గోడు వినిపించారు. కన్నీళ్లతో కష్టాలను వివరించారు.
విజయనగరం, కురుపాం/గుమ్మలక్ష్మీపురం: తిత్లీ తుపాను కురుపాం మండలంలోని జరడ పంచాయతీ పరిధి లోని వందల సంఖ్యలో ఇళ్లను నేలమట్టం చేసిం ది. గిరిపుత్రుల జీవనాధారమైన జీడి, చింత చెట్లను కూల్చేసింది. చిరుధాన్యాల పంటలను నాశనం చేసింది. తిండిగింజలను తడిపేసి అన్నానికి దూరం చేసింది. నిరాశ్రయులను చేసి దిక్కులేని పక్షులుగా మిగిల్చింది. ఈ నెల 11న వచ్చిన తిత్లీ తుపానుకు జరడ పంచాయతీ పరిధిలోని జరడ, నెమలిమానుగూడ, పొడిదం, కొత్తగూడ,గెడ్డగూడ, ఈతమానుగూడ, పట్టాయి గెడ్డ, చింతమానుగూడ, జంపరకోట గ్రామాల్లో మొత్తం 142 ఇళ్లకు నష్టం వాటిల్లింది. వాటిలో 79 ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మరో 63 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో వారంతా ఇప్పటికే జరడ గ్రామంలో మూత పడి ఉన్న గిరి జన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల భవనం, అంగన్‌వాడీ కేంద్రంతో పాటు జరడ పంచా యతీ భవనాల్లో తలదాచుకుంటున్నారు. ఒక్కో గదిలో మూడు కుటుంబాలు నివసిస్తున్నాయి.
నరకయాతన...
తిత్లీ తుపాను ప్రభావంతో సర్వం కోల్పోయిన గిరిజనం సమీపంలో ఉన్నభవనాల గదుల్లో తలదాచుకుంటూ ఏ రోజు కారోజు అటవీ ప్రాం తాలకు వెళ్లి తమ ఆహారాన్ని వండుకునేందుకు కర్రలు, తాగునీటిని సేకరించుకుంటున్నారు. పూర్తిగా నేలమట్టమైన ఇళ్లను చూసి కన్నీటిపర్యంతమవుతున్నారు. మొండిగోడలను తొలగించి కొత్తగా పాకలు/శాలలను నిర్మించుకునే పనుల్లో నిమగ్నమవుతున్నారు.
శాశ్వత ఇళ్లు నిర్మించాలని వినతి..
తుపాను అనంతరం జరడ పంచాయతీ పరిధి లోని బాధితులను పరామర్శించిన జిల్లా అధికారులు ఒక్కో ఇళ్లు కోల్పోయిన బాధితునికి రూ.10 వేలు చొప్పున తక్షణ సాయం అందిచారు. అలా గే, ఒక్కో బాధిత కుటుంబానికి ఒక్కో టార్పలీన్, 25 కేజీల చొప్పున బియ్యం వంటి నిత్యావసర సరుకులు అందజేస్తూ, త్వరలోనే శాశ్వత ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, నేటివరకు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని, ఎన్నిరోజులు ఈ భవనాల్లో తలదాచుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉందని బాధితులంతా వాపోతున్నారు.
అసలే చలికాలం ప్రారంభమవుతుండడంతో ఏజెన్సీలో చలితీవ్రత అధికంగా ఉంటోందని, ఇల్లు లేకపోవడం వల్ల పిల్లాపాపలతో తీవ్ర ఇబ్బందిపడాల్సి వస్తోందంటున్నారు. తమ జీవనాధారమైన చింత, జీడి, చిరుధాన్యాల పంటలపై అధికారులు చిత్తశుద్ధితో సర్వే చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దీంతో పాటు తమ గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా ఉందని పంచాయతీ ప్రజలు వాపోతున్నారు.
ధాన్యం తడిసిపోయాయి..
తిల్లీ తుపానుకు మా ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇంట్లో నిల్వ ఉంచిన 15 బస్తాల తిండి గింజలు(ధాన్యం) తడిసిముద్దాయ్యాయి. వాటిని తీసి చూస్తే ధాన్యం గింజలన్నీ మొలకెత్తి ఉన్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాం. చేసేది లేక మొలకెత్తిన ధాన్యం గింజలనే ఎండబెట్టి, శుభ్రం చేసి మిళ్లాడించి వచ్చిన బియ్యాన్నే ఆహారంగా తీసుకుంటున్నాం.– మండంగి చంద్రకళ, బాధితురాలు, జరడ
ఎన్నడూ చూడలేదు
నేను ఈ గ్రామంలోనే పుట్టి, ఈ గ్రామంలోనే మనుమాడాను. గత 80 ఏళ్లలో ఇంతటి తుపాను ఎన్నడూ చూడలేదు. ఇంత తీవ్రస్థాయిలో గాలులు మా గ్రామంలో ఎప్పుడూ వీయలేదు. మా గ్రామంలో ఇంత నష్టం జరగడం ఇదే మొదటిసారి. చాలా భయపడిపోయాను.– ఊయక లక్ష్మి, వృద్ధురాలు, జరడ
Comments
Please login to add a commentAdd a comment