
కాంగ్రెస్, టీడీపీలకు పుట్టగతులుండవు: తమ్మినేని
రాష్ట్రం రావణకాష్టంలా మారడానికి కారణమైన కాంగ్రెస్, టీడీపీ బాగోతాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీలకు పుట్టగతులండవని వైఎస్సార్ సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరిన తమ్మినేని తొలిసారిగా గురువారం ఆమదాలవలస వచ్చిన సందర్భంగా అభిమానులు, నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
ఆయన మాట్లాడుతూ సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు పన్నిన ఆంధ్రప్రదేశ్ విభజన కుట్రను రాష్ట్ర ప్రజలు సహించరన్నారు. 1983లో ఎన్నో ఆశయాలతో ఆవిర్భవించిన టీడీపీని ప్రస్తుతం చంద్రబాబు పదవీ కాంక్షతో, పిచ్చివాడిలా భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. అలాంటి పార్టీలో ఇమడలేక బయటికి వచ్చానని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన రైతులకు ఉచిత విద్యుత్ పథకంపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు ప్రస్తుతం అదే పథకాన్ని తాను అమలు చేస్తాననడం సిగ్గుచేటన్నారు.
పేదల కోసం పాటుపడిన మహోన్నతులుగా ఎన్‌టీ రామారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చరిత్రకెక్కారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అత్యధిక స్థానాలు సాధించి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. అంతకు ముందు తమ్మినేనికి స్వాగతం పలికేందుకు జిల్లావ్యాప్తంగా తరలి వచ్చిన వారితో శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ కిక్కిరిసి పోయింది.