సాక్షి ప్రతినిధి, కర్నూలు/ సాక్షి నెట్‌వర్క్ : ‘ఎన్ని హామీలిచ్చారో.. ఎన్నెన్ని వాగ్దానాలు చేశారో.. అధికారంలోకి వచ్చాక అన్నీ మరిచారు.. నమ్మించి నిండా ముంచారు..’ అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు, పింఛన్, ఇల్లు.. ఇలా ఏ ఒక్క పథకాన్నీ పేదలకు అందించకుండా, అన్నీ తమవారికే అన్నట్లు పాలకులు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాసంకల్ప యాత్ర ద్వారా తమ దగ్గరికి వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తమ కష్టాలు చెప్పుకొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాంతం, కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్ర బుధవారం ఆళ్లగడ్డ మండలం ఆర్.కృష్ణాపురం నుంచి పెద్దకోటకందుకూరుకు చేరుతుండగా సీపీఎస్ ఉద్యోగులు వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీపీఎస్ విధానం వల్ల తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని రామకృష్ణానాయక్ జగన్‌కు వివరించారు. రామకృష్ణానాయక్ తండ్రి మోతీనాయక్ ఆరోగ్య శాఖలో ఆళ్లగడ్డలో వాచ్‌మన్. 2014 సెప్టెంబర్‌లో ఉద్యోగ విరమణ చేశారు.
అయితే.. 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానం వర్తిస్తుండటంతో ఆయనకు ఇప్పటి వరకూ బెనిఫిట్స్‌గానీ, పెన్షన్‌గానీ అందలేదు. పాత పెన్షన్ విధానం ప్రకారం అయితే ఉద్యోగ విరమణ పొందిన వెంటనే గ్రాట్యుటీ, పీఎఫ్ రూపంలో రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ అందేవని, ప్రతినెలా రూ.9 వేలు పింఛన్‌గా వచ్చేదని రామకృష్ణ తెలిపారు. సీపీఎస్ ప్రకారం రూ.60 వేలు చేతికిచ్చి.. మిగిలిన రూ.20 వేలు సీపీఎస్ ఖాతాలో జమ చేశారని చెప్పారు. పింఛన్ కూడా షేర్ మార్కెట్ విలువ ప్రకారం నెలకు రూ.640 మాత్రమేనని, ఇంతటి దారుణమైన సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా ఇప్పటి వరకు సీపీఎస్ కిందకు వచ్చే ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా 121 మంది ఉద్యోగ విరమణ చేశారని, ఉద్యోగి మరణిస్తే ఆ తర్వాత కుటుంబ సభ్యులకు పింఛన్ ఇచ్చే వెసులుబాటు సీపీఎస్ విధానంలో లేదని ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు వివరించారు. వారి ఆవేదన విన్న జగన్.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగిస్తామని వారికి హామీ ఇచ్చారు.
దరఖాస్తులను చించేస్తున్నారయ్యా..
నా కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందించడం లేదయ్యా.. ఉద్దే«శపూర్వకంగానే పింఛన్, ఇళ్లు, రేషన్‌కార్డుల వంటివి ఇవ్వడం లేదు.. అంటూ పెద్దకోట కందుకూరుకు చెందిన వృద్ధ దంపతులు దాసరి నాగేశ్వరరావు, మల్లమ్మ వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద ఆధార్ నంబర్ తప్ప ఏదీ లేదన్నారు. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే జన్మభూమి కమిటీ సభ్యులు తమ దరఖాస్తులను చించేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డు లేకపోయినా వైఎస్సార్ హయాంలో పింఛన్‌లు ఇచ్చారని చెప్పారు.
మంజూరైన ఇంటిని రద్దు చేశారయ్యా..
ఎవరిని అడిగినా ఇల్లు మంజూరు చేయడం లేదయ్యా.. ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకుంటే.. చివరికి మంజూరు చేశారు. అయితే గ్రామంలోని కొందరు దానిని రద్దు చేయించారు. దీంతో గుడిసెలోనే ఉంటున్నాం.. అంటూ పెద్దకోట కందూకూరుకు చెందిన రామసుబ్బయ్య కుటుంబ సభ్యులు జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం నడిబొడ్డున గుడిసెలో కాపురముంటున్న రామసుబ్బయ్యను వైఎస్ జగన్ గుడిసె లోపలికి వెళ్లి పలకరించినప్పుడు వారు కష్టాలు చెప్పుకున్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే పేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు పక్కా ఇళ్లు కట్టిస్తామని జగన్ హామీ ఇచ్చారు. పెద్ద కోటకందుకూరుకు చెందిన బికారి అనే వ్యక్తికి వైఎస్ హయాంలో 20 బస్తాల సిమెంటు, రూ.6 వేలు బిల్లు వచ్చింది. వైఎస్ మరణానంతరం మిగతా బిల్లులు రాలేదు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఇంటి పైకప్పు వేస్తేనే మిగిలిన డబ్బులిస్తామంటున్నారు.. అని జగన్ ఎదుట వాపోయాడు. బ్యాంకు రుణాలకు వడ్డీని ప్రభుత్వం చెల్లించడం లేదని ఆళ్లగడ్డలోని వీరభద్రస్వామి మహిళా సమాఖ్యకు చెందిన నాగేశ్వరమ్మ, తమకు ఇళ్లు లేవని చాగలమర్రికి చెందిన గౌసియా, సహేరా, బీబీ, వృద్ధాప్య పింఛన్ రావడంలేదని కృష్ణాపురం గ్రామానికి చెందిన జ్యోతి, ఓబులమ్మ, మద్యాన్ని నిషేధించాలని చాగలమర్రి మండలం కృష్ణాపురానికి చెందిన ప్రభావతి, జయమ్మ, నిర్మల, విజయలక్ష్మి వైఎస్ జగన్‌కు విన్నవించారు. అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని జగన్ వారికి భరోసా ఇచ్చారు.
కొత్త నాటకానికి తెర తీశారు
జగన్ పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు తమ సమస్యలు విన్నవిస్తుండటంతో బెంబేలెత్తిపోయిన ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసింది. ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రజలను కలిసి తమకు సమస్యలు తెలపాలని, వాటికి పరిష్కారం కల్పిస్తామని నమ్మబలుకుతున్నారు. అయితే, ఇన్నాళ్లుగా తమవైపు కన్నెత్తి చూడని ప్రభుత్వం ఇప్పుడు సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తామంటుంటే ప్రజలు నమ్మడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment