సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘‘అదిగో అక్కడ సబ్బుల ఫ్యాక్టరీని కడతా...ఇదిగో ఇక్కడ పారిశ్రామిక వాడను నిర్మిస్తా...అల్లదిగో..అక్కడ టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తా! ‘అనంత’ను కరువు రహిత జిల్లాగా మార్చి...అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా! నా అనుభవాన్నంతా ఉపయోగించి ‘అనంత’ రాతను మారుస్తా!’ టీడీపీని ఆదరించండి.’’
ఎన్నికల ప్రచారంలో జిల్లాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. ఈ మాటలు విన్న ‘అనంత’ ప్రజానీకం జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలతో పాటు అన్ని మునిసిపాలిటీలో చైర్మన్ పీఠాలను టీడీపీకే కట్టబెట్టారు. అయితే చంద్రబాబు మాత్రం ఇచ్చిన మాటలను అమలు చేయడంలో పూర్తి నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. ఆర్నెళ్ల కాలంలో ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్క పింఛన్లపై ఇచ్చిన మాటను మినహా ఏ ఒక్కటినీ నిలుపుకోలేదు. అరకొరగా నామమాత్రపు సర్వేలు చేయడం మినహా తీసుకున్న చర్యలు శూన్యం.
వీటితో పాటు రాజధాని ప్రకటన సమయంలో అసెంబ్లీ సాక్షిగా మరో 16 వరాలను జిల్లాకు ప్రకటించారు. వీటిపై కూడా అతీగతీ లేదు. అధికారం చేపట్టిన ఆర్నెళ్లలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇది అందరూ ఆమోదించాల్సిన విషయమే! అయితే ఇచ్చిన హామీల్లో ప్రాధాన్యత ప్రకారం కొన్నిటికైనా భూసేకరణ, నివేదికలు తెప్పించుకోవడం, కొంతమేరకైనా నిధులు ప్రకటించడంతో పాటు ప్రాథమిక అభివృద్ధి చర్యలు కూడా తీసుకోకపోవడమే బాధాకరమని విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
బాబు హామీలు.. ఆచరణలో పరిస్థితి
⇒ హిందూపురంలో బసవతారకం కేన్సర్ ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకూ అతీగతీ లేదు
⇒ఐదు ఎకరాల వరకూ వంద శాతం సబ్సిడీతో డ్రిప్, 10 ఎకరాల వరకూ 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇస్తామన్నారు. కనీసం జీవో కూడా జారీ చేయలేదు.
⇒ ఏడాదిలోపు హంద్రీ-నీవా పూర్తి చేస్తామన్నారు. వాస్తవానికి ఇది పూర్తయ్యేందుకు రూ.500 కోట్లు అవసరమైతే గత బడ్జెట్‌లో కేవలం వందకోట్లు మాత్రమే కేటాయించారు.
⇒ మార్కెట్ సదుపాయాలు కల్పించి, జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామన్నారు. కానీ చర్యలు లేవు
⇒ పింఛన్ల అర్హతను 5 ఎకరాలుగా ఉంది. ‘అనంత’లో మాత్రం 10ఎకరాల వరకూ సడలింపు ఇస్తామన్నారు. ఆ మేరకు జీవో జారీ చేశారు.
⇒ రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. కానీ పాక్షికంగా కూడా ఇంకా చెల్లించలేదు.
⇒ సబ్బల ఫ్యాక్టరీని నిర్మిస్తామన్నారు. కానీపురోగతి లేదు.
⇒ హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తి చేస్తామన్నారు. కానీ తీసుకున్న చర్యలు నామమాత్రమే
⇒ ఉద్యానవన కేంద్రం, సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ అనుబంధ కేంద్రం, నూతన పారిశ్రామిక నగరం.. వీటన్నింటి జాడే లేదు.
⇒ ‘అనంత’ను స్మార్ట్‌సిటీగా చేస్తామన్నారు. స్మార్ట్ సంగతి పక్కనపెడితే పందులపై చర్యలు కూడా తీసుకోలేదు.
⇒ టెక్స్‌టైల్ పార్క్, ఫుడ్‌పార్క్ అన్నారు. ఎలాంటి ముందడుగు వేయలేదు.
⇒ ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ క్లస్టర్ అన్నారు. దాని సంగతే మరిచారు.
⇒ సోలార్, విండ్ పవర్ హబ్ అన్నారు. ఎన్‌పీ కుంట వద్ద స్థల సేకరణ పనులు జరుగుతున్నాయి
⇒ పెనుకొండలో ఇస్కాన్ ప్రాజెక్టుకు సర్వే పనులు చేపట్టారు
⇒ బీఈఎల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) ప్రస్తావనలేదు
⇒ ఆధ్మాతికనగరంగా పుట్టపర్తి అన్నారు. కానీ పుట్టపర్తి అలాగే ఉంది
⇒ పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రమన్నారు. ఏదీ జరగలేదు.
⇒ కుద్రేముఖ్ ఇనుప ఖనిజ ఆధాతితి ప్రాజెక్టు అన్నారు. కానీ గతంలో ఎలా ఉందో, ఇప్పుడు అలాగే ఉంది.
అరచేతిలో వైకుంఠం!
Published Tue, Dec 9 2014 1:55 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement