
వైఎస్సార్ గుండె చప్పుడే మేనిఫెస్టో
కోవూరు, న్యూస్‌లైన్: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గుండె చప్పుడే వైఎస్సార్‌సీపీ ప్రకటించిన మేనిఫెస్టో అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కోవూరులోని అన్ని ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో సోమవారం ఆయన ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రజలు రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ, ఆధార్‌కార్డులు, పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారన్నారు.
ఇలాంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించేలా తమ నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిక రూపొందించారన్నారు. అందుకోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రామంలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తారని చెప్పారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకు ప్రతి నెలా ప్రస్తుతం ఇస్తున్న రూ.2,500ను రూ.5 వేలకు పెంచుతామన్నారు. అర్చకులకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయడంతో పాటు ఇల్లు, భూములు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
నిరుద్యోగులైన మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పిం చేందుకు రూ.5 లక్షలు వరకు వడ్డీ లేని రుణం మంజూరు చేస్తామన్నారు. మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించి, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు ప్రణాళిక సిద్ధమైందన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. దళిత క్రైస్తవులందరినీ ఎస్సీలుగా గుర్తిస్తామన్నారు.
మద్యం పంచేది లేదు
ఎన్నికల్లో తాము ఎట్టి పరిస్థితుల్లో మద్యం పంపిణీ చేయబోమని ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మహిళలందరూ సమష్టిగా మద్యంపై పోరాడాలని పిలుపునిచ్చారు. మద్యం పంచేందుకు గ్రామాలకు వచ్చే నాయకులను తరిమికొట్టాలని సూచించారు. కోవూరులో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థి భారీ ఎత్తున మద్యం పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు.
కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు మండలాల్లో ఆయన అనుచరులకే బ్రాందీషాపులు ఉన్నాయని, మద్యం కోసం ఆయా దుకాణాల్లో ఇప్పటికే రూ.2 కోట్లు డిపాజిట్ చేశారని చెప్పారు. ఆ నేత అనుచరుడు ఇటీవల కొడవలూరు మండలంలో మద్యం పంపిణీ చేస్తూ ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారన్నారు. వారిపై ఎన్నికల అధికారులు విచారణ జరిపి, సంబంధిత దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ములుమూడి వినోద్‌కుమార్‌రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణయ్య, నిరంజన్‌బాబురెడ్డి, తాటిపర్తి విజయ, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, మోడెం శ్రీనివాసులురెడ్డి, సీతారామిరెడ్డి, సర్పంచ్ కూట్ల ఉమ, గడ్డం రమణమ్మ, ఇంతా మల్లారెడ్డి, దినేష్‌రెడ్డి, కృపావతి, జ్యోత్స్న, మంచి శ్రీనివాసులు, పుచ్చలపల్లి శ్రీనివాసులు, సుధీర్‌రెడ్డి మారంరెడ్డి వంశీ, నందు, నలుబోలు సుబ్బారెడ్డి, తిరుపతిరెడ్డి, జనార్దన్‌రెడ్డి, మల్లికార్జున్, హరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.