రైతు ప్రయోజనమే లక్ష్యంగా..
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి తన తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశలో ‘మేనిఫెస్టో’ రూపంలో ముందడుగు వేశారని రైతు సోదరులు అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిపథంలో పయనింజేసే బృహత్తర ప్రణాళికలో భాగంగా ‘గ్రామీణ విత్తనాభివృద్ధి పథకానికి’ మళ్లీ ఊపిరిపోయాలనుకోవడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు.
విత్తనాభివృద్ధి ఉత్పత్తులకు మార్కెట్ ధర...
జగన్ హయాంలో ఎలాంటి దళారులకు అవకాశాలు లేకుండా పారదర్శకంగా స్వయం విత్తన సమృద్ధికి ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. దుకాణాల్లో నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి, రైతులు నష్టపోకుండా సొంత విత్తనాలను రైతే తయారు చేసుకునేందుకు ఈ పథకం దోహదపడనుంది.
రైతులు ఉత్పత్తి చేసే విత్తనాలకు మార్కెట్ ధర లభించే విధంగా ప్రణాళిక తయారైంది. రెతు ఇంటి పంటనే విత్తనంగా మార్చేందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాల్లోకే తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మూల విత్తనాలతో మూడేళ్ల వరకూ సొంత విత్తనాలు తయారీ చేసుకునే విధానం రానుంది. ఈ పథకంపై తరచూ రైతులకు సుశిక్షితులైన శిక్షణాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
మూల విత్తనాలే కీలకం...
వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో శాస్త్రవేత్తలు పరిశోధించిన మూల విత్తనాలనే జననేత హయాంలో ఈ పథకం ద్వారా సరఫరా చేయనున్నారు. ఈ పథకం ద్వారా విత్తనాలు పొందిన రైతు వద్ద అదే మూల విత్తనాల ద్వారా మూడేళ్ల వరకూ సొంత విత్తనాల తయారీకి ఉపయుక్తమవుతుంది. ఆ రైతు తన చుట్టుపక్కలున్న రైతులకు కూడా ఈ విత్తనాలను తనకు గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు. ఈ రైతులకు దఫదఫాలుగా శిక్షణ ఉంటుంది. విత్తనాలు నాటే దశ, పూత దశ, కోత దశల్లో ఈ శిక్షణల్ని వ్యవసాయాధికారులు నిర్వహిస్తారు.
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. వైఎస్ అధికారంలోకి రాకముందు రైతులు వ్యవసాయం చేయాలంటేనే భయపడిపోయేవారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చాక విత్తనాలు, ఎరువులు తదితరాలు సబ్సీడీలో అందించడంతో పాటు రైతుప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారికోసం కొన్ని ప్రత్యేక పథకాలను అమలు చేశారు.
వాటిలో ‘గ్రామీణ విత్తనాభివృద్ధి పథకం’ ఒకటి. అప్పట్లో ఈ పథకం అమలులో భాగంగా మూల విత్తనాల్ని సబ్సిడీపై వ్యవసాయ యూనివర్సిటీల నుంచే గాక జిల్లాలోని ఘంటసాల, గరికపాడు, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో విత్తన కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు సరఫరా చేసేవారు. ముఖ్యమంత్రి వైఎస్‌కు వ్యవసాయ రంగం అభివృద్ధిపై ఉన్న మక్కువను బట్టి వ్యవసాయాధికారులు కూడా సమర్థవంతంగా రైతులకు విత్తనాలు సమకూర్చేవారు. గ్రామాల్లో విత్తనాభివృద్ధికి సంపూర్ణంగా పనిచేసేవారు.