‘మీ రుణం తీర్చుకుంటామయ్యా’ | peoples are looking for ysr ruling again | Sakshi
Sakshi News home page

‘మీ రుణం తీర్చుకుంటామయ్యా’

Published Tue, May 6 2014 3:17 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

‘మీ రుణం  తీర్చుకుంటామయ్యా’ - Sakshi

‘మీ రుణం తీర్చుకుంటామయ్యా’

 ‘మొన్నే  కడపకు పోయింటి. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది..శుక్లం ఆపరేషన్ చేస్తారా అని అడిగితే.. లేదు ఇప్పుడు ఆ పథకంలోంచి ఈ ఆపరేషన్ తీసేసినారు. రూ.10 వేలు ఖర్సయితాది అంటే  చేసేదిలేక వచ్చానయ్యా’
 
తెల్లారితే ఓటింగ్..  ఓటు వేయడానికి హైద్రాబాద్ నుంచి వస్తున్న మనవడిని పిలుచుకురావడానికి బైపాస్‌లోకి వెళ్తున్నాడు తాత సుబ్బయ్య. సరిగ్గా రాత్రి 9.30 అయింది. అంతలోనే.. ‘యాడికి సుబ్బయ్య  మామా.. ఇయ్యాలప్పుడు బయలుదేరినావ్..’ అని అడిగాడు టీవీఎస్‌లో పోతున్న సుబ్బయ్యను పక్కింటి నరేష్. ‘మనవడు హరి హైద్రాబాద్ నుంచి వచ్చాంటే రోడ్డుపైకి పోతానాబ్బి’ అంటూ జవాబిచ్చాడు సుబ్బయ్య. ఊరి నుంచి బైపాస్‌కు రెండు కిలోమీటర్ల దూరం ఉంది. అంతా గతుకుల రోడ్డే. 2008లో ఈ రోడ్డుకు నిధులొచ్చినా ఆ రెండు పార్టీల నాయకుల  టెండర్  గొడవతో  వచ్చిన ఆ నిధులు వెనక్కిపోయాయి. గుంతలు పడి.. కంకర లేచి దరిద్రంగా తయారైన ఆ రోడ్డుపై  చిన్నగా పోతున్నాడు సుబ్బయ్య.
 
 ఏం నాయకులో.. ఏం పెభుత్వమో ప్రజల గోడు  పట్టని పెభుత్వాలు ఎందుకు అంటూ తనలో తాను గొణుక్కుంటూ ప్రయాణం సాగించాడు.  మొత్తానికి బైపాస్‌లోకి వచ్చాడు. బండి పక్కన నిలబెట్టి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. చుట్టుపక్కల ఊర్ల వంక చూశాడు.  ఎక్కడేగానీ వెలుతురు కనిపించలా. ఏం కరెంటో ఏమో అనుకున్నాడు. జేబులోంచి చుట్ట తీసి వెలిగించేలోపే ఎదురుగా తెల్లగా వెలుతురు.. కాస్సేపు అలా చూస్తుండిపోయాడు. చేతికి అగ్గిపుల్ల సెగ తగులుతూనే ‘అబ్బా’ అని పుల్ల కిందకు పడేశాడు సుబ్బయ్య తాత. అంతలోనే ‘ఏం తాతా ఎలా ఉన్నావ్’ అంటూ ఓ పెద్దాయన సుబ్బయ్య భుజంపైన చేయి వేశారు.

తలపాగా నెత్తిన చుట్టి.. అచ్చ తెలుగు పంచెకట్టు కట్టి.. తెల్లగా మెరిపిసోతున్నారు.. చిరునవ్వుతో వెలిగిపోతున్నారు.. ఆ ‘మహా’ రూపాన్ని చూసిన సుబ్బయ్య రెండు చేతులతో నమస్కారం పెట్టాడు. ‘మీరూ..’ అనేలోపే.. ‘ఆ నేనే తాత.. ఎలా   ఉన్నావు’ అని మళ్లీ ప్రశ్నించాడా పెద్దాయనా. ‘ఏం బాగున్నానయ్యా.. మీరు లేక రాష్ర్టం కుక్కలు చింపిన విస్తరైంది. ఎవరు మంత్రో.. ఎవరు ముఖ్యమంత్రో అర్థం కావట్లే. ఈ నాలుగన్నరేళ్లు అధికారం, ప్రతిపక్షం ఒక్కటై  ప్రజల కష్టాలను గాలికొదిలేసినారు. చివరికి ఈ కమలాపురం రైల్వే బ్రిడ్‌‌జకు మీరు నిధులు మంజూరు చేసినా ఇక్కడి నాయకులు ఊరి బయటి నుంచి కావాలని ఒకరంటే.. ఊర్లోంచి కావాలని మరొకరు.. చివరకు నిధులు వెనక్కిపోయేలా చేసినారు. ఇన్నాళ్లు వీళ్లను వాళ్లు.. వాళ్లు వీళ్లను తిట్టుకున్నోళ్లు ఇప్పుడేమో ఇద్దరూ ఒక్కటైనారు.’ అంటూ జరిగిన కుతంత్రాలను సెప్పుకొచ్చాడు సుబ్బయ్య. ఆ పెద్దాయన ఊ కొట్టారు.
 
 ‘పంటలు ఎలా పండుతున్నాయ్’అని ప్రశ్నించారు. ‘కరెంటుండట్లేదు.. పైగా వానలు లేవు.. పంటలు పండక అప్పులు పెరిగిపోయినాయ్.’ అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు సుబ్బయ్య. ‘ఈ మధ్యే నాకు కంటి చూపు కూడా దెబ్బతిందయ్యా’ అని వాపోయాడు. ‘మరి ఆరోగ్య శ్రీ కింద ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా తాతా అని’ ఆ పెద్దాయనా ప్రశ్నించాడు. ‘మొన్నే  కడపకు పోయింటి. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది..శుక్లం ఆపరేషన్ చేస్తారా అని అడిగితే.. లేదు ఇప్పుడు ఆ పథకంలోంచి ఈ ఆపరేషన్ తీసేసినారు. రూ.10 వేలు ఖర్సయితాది అంటే  చేసేదిలేక వచ్చానయ్యా’ అంటూ తన ఆవేదన అంతా వ్యక్తం చేశాడు సుబ్బయ్య. ‘అయ్యో. భయపడద్దు తాతా ’అంటూ సముదాయించారు ఆ పెద్దాయనా. ‘ఇప్పుడు ఎవరూ భయపడట్లేదయ్యా.. మీ వారసుడు వస్తున్నాడని ఆశగా ఉన్నారయ్యా..  మీ పేరు నిలబెడుతూ.. ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా అయ్యా.

వస్తాడయ్యా.. మీ పేరు నిలబెడతాడు.. మళ్లీ ఆ సువర్ణపాలన తెస్తాడయ్యా. ఆ ప్రసంగం.. ఆ మాటతీరు.. ఆ హావభావాలు ఆయన్లోనే మిమ్మల్ని చూసుకుంటున్నాం.. మీ రుణం తీర్చుకుంటామయ్యా’ అని సుబ్బయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ పెద్దాయన కళ్లల్లో నీళ్లు తిరిగాయ్. ఉద్వేగమో.. లేక ప్రజల మనస్సుల్లో బిడ్డ సంపాదించుకున్న అభిమానం చూసి గర్వమో..  ‘చాలు తాతా.. ఈ జన్మకు ఇది చాలు.. మీ ఆశీర్వాదం ఉంటే  మళ్లీ సువర్ణ పాలన తీసుకొస్తాడు నా బిడ్డ’ అంటూ సుబ్బయ్యకు ధైర్యమిచ్చాడు. అంతలోనే ‘తాతా.. లేయ్ తాతా’ అంటూ మనవడు హరి పలకరింపు.. ఉలిక్కిపడిలేచాడు సుబ్బయ్య. తనలో తాను తను కన్న కలను గుర్తు చేసుకుంటూ సముదాయించుకున్నాడు సుబ్బయ్య. ‘ వచ్చావా హరీ.. బాగున్నావ్’ పా పొదాం అంటూ ఇద్దరూ బయల్దేరారు. - న్యూస్‌లైన్, కడప డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement