చరిత్ర తిరగరాయనున్న సంతకం
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే చేసిన తొలి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్‌పైనే. ఆయన వారసుడు, యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను ముఖ్యమంత్రి కాగానే చేసే మూడో సంతకం ‘ధరల స్థిరీకరణ’పైన. వైఎస్సార్ చేసిన ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకం రైతుల చరిత్రను మార్చితే.. జననేత చేసే సంతకం రైతుల చరిత్ర తిరగరాయనుంది.
అమలాపురం, న్యూస్‌లైన్ : ప్రస్తుత వ్యవసాయ సంక్షోభానికి కారణం రైతు పండించిన పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడమే. పంట పొలాల్లోను.. తోటల్లోను ఉన్నప్పుడు లాభసాటిగా ఉంటున్న ధర పంట చేతికి వచ్చే సమయానికి పడిపోతుంది. వరి ధాన్యం, పత్తి, మొక్కజొన్న, చెరకు, కొబ్బరి, ఆయిల్ పామ్, కూరగాయల ధరలు, మత్స్య ఉత్పత్తులు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిరకాల పంటల పరిస్థితి ఇంచుమించు ఇదే. ఈ కారణంగా అధిక దిగుబడులు సాధించిన రైతులు సైతం గిట్టుబాటు ధర లేక నష్టపోవడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైంది.
మద్దతు దక్కకే సాగుసమ్మె
2010-11 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిటీ (సీఏసీపీ) సాధారణ రకం వరికి క్వింటాల్‌కు రూ.1000 మద్దతు ధర ప్రకటించింది. అయితే ఆ ఏడాది రబీ దిగుబడి అంచనాలకు మించి వచ్చింది. ఇదే సమయంలో ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయిస్ గొడౌన్లు ఆశించిన స్థాయిలో ఖాళీగా లేకపోవడం, రైల్వే వ్యాగన్ల ర్యాక్‌లు అవసరమైన మేర కేటాయించకపోవడం ఇబ్బందిగా మారింది. ఈ వంకతో ధాన్యం కొనుగోలు చేయకుండా మార్కెట్‌లో దళారులు ధరను తగ్గించివేశారు. మద్దతు ధర బస్తా (75 కేజీలకు) రూ.750గా ఉండగా, చాలాచోట్ల రూ.600లు చొప్పున కూడా కొనుగోలు చేశారు. పంట ఎక్కువగా పండినా నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమవడంతో కడుపుమండిన రైతులు సాగుసమ్మెకు దిగారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సుమారు 90 వేల ఎకరాల్లో వరిసాగు చేయకుండా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. అయినా రైతుల గోడును ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు. కేంద్రం మద్దతు ధర పెంచకున్నా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.200 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం ఇప్పటికీ చెవికెక్కించుకోలేదు.
జగన్ మూడవ సంతకం... ధరల స్థిరీకరణ
తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్ర చరిత్ర తిరగరాసే విధంగా మూడవ సంతకం ధరల స్థిరీకరణపై చేస్తానని యువనేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ సంతకంతో రైతులకు ఒనగూరే ప్రయోజనాలు...
పంటచేతికొచ్చే వేళ మార్కెట్ మాయాజాలంలో అకస్మాత్తుగా ధరలు పడిపోతే ప్రభుత్వమే రంగంలోకి దిగి తగిన ధరను చెల్లించడం.
దళారులు, వ్యాపారులు కృత్రిమంగా కొనుగోలులో సంక్షోభాన్ని సృష్టించే పరిస్థితి నుంచి రైతుకు రక్షణగా నిలవడం.
ఇందుకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.3వేల కోట్ల నిధిని ప్రవేశపెట్టడం.
మార్క్‌ఫెడ్, ఆగ్రోస్, పౌరసరఫరాల సంస్థ, ఆయిల్ ఫెడ్, హాకా వంటి ప్రభుత్వ సంస్థలను సమన్వయపరుస్తూ ఓ కొనుగోలు వ్యవస్థ నిర్మాణం.
నాఫెడ్, ఎఫ్‌సీఐ, టొబాకో బోర్డు, స్పైస్‌ఫెడ్ వంటి కేంద్ర సంస్థలు.. కొన్ని పంటలకే మద్దతు ధర చెల్లిస్తూ కొంటున్నాయి. మద్దతు ధర ప్రకటించని పంటలకు సైతం రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోళ్లు సాగిస్తూ ధరల పతనం నుంచి రైతును కాపాడటం.
రైతుబంధు పథకాన్ని పటిష్ట పరిచి మార్కెట్‌లో అపరిమిత గోదాముల సౌకర్యం వంటి చర్యలకు ఈ ధరల స్థిరీకరణ అదనం.
సంతకంతో సాగుకు భరోసా
కనీస మద్దతు ధరకు సైతం నోచుకోకుండా పోతున్న రైతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ధరల స్థిరీకరణ సంతకంపై కొండంత ఆశ పెట్టుకున్నారు.
అంచనాలకు మించి పంటల దిగుబడి పెరిగినప్పుడు డిమాండ్ లేదని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశముండదు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినప్పుడు నాణ్యత, నిబంధనల పేరుతో మద్దతు ధరకు కోత విధించే అవకాశం లేకుండా పోతుంది.
వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌లో అమ్మేందుకు దళారులపైనే ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మార్క్‌ఫెడ్, ఆగ్రోస్, పౌరసరఫరాల సంస్థ, ఆయిల్ ఫెడ్, హాకా వంటి ప్రభుత్వ సంస్థలను సమన్వయపరుస్తూ ఏర్పాటు చేసే కొనుగోలు వ్యవస్థ ద్వారా అమ్మకాలు సాగించవచ్చు.
పండించిన పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర ఉంటుందనే ధైర్యం .. ప్రభుత్వమే కొంటుందనే నమ్మకం ఉంటే వ్యవసాయానికి భరోసా ఉంటుందని రైతులు నమ్ముతున్నారు.